ఫస్ట్ టైమ్ ఎంపీ: నంద్యాలలో ఏం జరుగుతోంది ..!
నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి గత ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కించుకున్న బైరెడ్డి శబరి దూకుడుగా ముందుకు సాగుతున్నారు.;
నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి గత ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కించుకున్న బైరెడ్డి శబరి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అటు రాజకీయంగా పైచేయి సాధించడంలోనూ.. ఇటు.. రాష్ట్రానికి సంబంధించిన బలమైన వాయిస్ వినిపించడంలోనూ.. శబరికి సీఎం చంద్రబాబు దగ్గర మంచి మార్కు లు పడుతున్నాయి. పెట్టుబడుల కల్పనపై తరచుగా ఢిల్లీలో మాట్లాడుతున్న శబరి.. చంద్రబాబు విజన్ 2047పై కూడా దేశ విదేశాల్లో వాయిస్ వినిపిస్తున్నారు. ఐక్య రాజ్యసమితిలో గత ఎన్నికల్లో జరిగిన కార్యక్రమంలో భారత ప్రతినిధి బృందంలో వెళ్లిన శబరి.. ఏపీ గురించి ప్రస్తావించారు.
ఇది.. చంద్రబాబును ఎంతో ఆకర్షించింది. అయితే.. నియోజకవర్గం స్థాయిలో మాత్రం.. ఆమెకు పెద్దగా సహకారం లేదనే చెప్పాలి. దీనికి ఆమె స్వయంకృత రాజకీయమే కారణమని పార్టీలో చర్చ ఉంది. సొంత అజెండాను అమలు చేస్తున్నారని.. స్థానికంగా ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయడం లేదని.. ఆమెపై విమర్శ లు ఉన్నాయి. శ్రీశైలం, నందికొట్కూరు, బనగానపల్లి, డోన్ నియోజకవర్గాల్లో ఈ తరహా విమర్శలు ఎక్కువ గా ఉన్నాయి. శ్రీశైలంలో అయితే.. ఏకంగా రోడ్డెక్కేశారు. దీనికి కారణం.. ఆమె గత ఎన్నికలకు ముందు వరకు బీజేపీలో ఉండడం.. తర్వాత టీడీపీలోకి వచ్చినా.. ఈ నేతలతో కలిసి ముందుకు సాగకపోవడం కారణమని అంటున్నారు.
ఈ నేపథ్యంలో తరచుగా నియోజకవర్గాల్లో శబరికి సెగ తగులుతోంది. ''కనీసం ప్రొటోకాల్ కూడా పాటించడం లేదు. అధికారులను ఆమె చేతిలో పెట్టుకున్నారు. ఇక, మేం ఎమ్మెల్యేగా ఉండి ప్రయోజనం ఏంటి?'' అని శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి బహిరంగ వ్యాఖ్యలే చేశారు. డోన్‌లోనూ.. ఇదే తరహా వ్యాఖ్యలు వినిపించాయి. వ్యక్తిగతంగా శబరితో విభేదించకపోయినా.. డోన్ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాత్రం ఆమె దూకుడును ప్రశ్నిస్తున్నారు. కనీసం .. తనకు చెప్పకుండానే కొన్ని కొన్ని కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నది ఆయన చెబుతున్న మాట.
అయితే.. నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉన్నా.. చంద్రబాబు దగ్గర మాత్రం శబరికి మంచి మార్కులు పడ్డాయి. పడుతున్నాయి. ఆమె చేస్తున్న రాజకీయాలు ఎలా ఉన్నా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోనూ.. సీఎం విజన్‌ను ఇతర వేదికలపై వివరించడంలోనూ.. శబరి చూపుతున్న శ్రద్ధను ఆయన మెచ్చుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఆమెపై ఫిర్యాదులు చేయాలని అనుకున్నా.. వెనక్కి తగ్గుతున్నారు. అయితే.. ఇది వచ్చే ఎన్నికల వరకు సాగితే.. మాత్రం శబరికి ఇబ్బందులు తప్పవు. పనితీరు ఎంత బాగున్నా.. అందరినీ కలుపుకొనిపోతే.. వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.