డిజిటల్ విప్లవం నిలిపిన ప్రాణం.. పునర్విక సేఫ్

చిన్నారి పునర్వికకు ప్రాణాపాయం తప్పింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పునర్వికకు హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఇంజక్షన్ చేయించారు.;

Update: 2026-04-18 18:28 GMT

చిన్నారి పునర్వికకు ప్రాణాపాయం తప్పింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పునర్వికకు హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఇంజక్షన్ చేయించారు. మంత్రి నారా లోకేశ్ ఆస్పత్రిని సందర్శించి పునర్విక తల్లిదండ్రులను పరామర్శించారు. పునర్విక వైద్యం కోసం సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఉద్యమించింది. సేవ్ పునర్విక హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా చేపట్టిన విప్లవం దాతలను కదిలించింది. రూ.16 కోట్ల డబ్బును సమీకరించడంతో పునర్వికకు ఆదివారం ఖరీదైన ఇంజక్షన్ చేయించారు.

లోకేశ్ ట్వీట్

‘‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. పునర్వికకు ఇంజక్షన్ చేయించాం. నిండు నూరేళ్లు హాయిగా వర్ధిల్లు చిట్టితల్లి’’ అంటూ చిన్నారి పునర్వికను ఎత్తుకున్న ఫొటోను మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. దీంతో పునర్విక వైద్యం పూర్తయిందని, ఆమె ప్రాణ గండం నుంచి గట్టెక్కిందని సోషల్ మీడియా ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన చిన్నారి పునర్విక తల్లిదండ్రులు జంపాల మంగళ సురేష్ కుమార్, పుష్పవతి నిరుపేదలు. పునర్విక తండ్రి హెయిర్ కంటింగ్ సెలూన్ నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. అలాంటి పేద కుటుంబానికి తట్టుకోలేని కష్టం ఎదురైంది.

అరుదైన వ్యాధి

2025 మే 12న పునర్విక జన్మించగా, పుట్టిన ఆరు నెలల వరకు బాగానే ఉంది. కానీ, పుట్టిన ఆరు నెలల తర్వాత ఆమె మెడ నిలవకపోవడంతో వైద్యులకు చూపిస్తే అరుదైన ఖండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. చిన్నారి పునర్వికకు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA Type-1) ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా ఈ వ్యాధి చికిత్సకు రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ చేయాలని సూచించారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంత ఖరీదైన వైద్యం చేయించడం ఆ కుటుంబానికి తీరని వేదననే కలిగించింది. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న నెటిజన్లు భారీ ఎత్తున స్పందించారు.

సోషల్ మీడియా విప్లవం

సేవ్ పునర్విక అంటూ సోషల్ మీడియా పిలుపుతో ఎందరో స్పందించి రూ.10 కోట్లు వరకు పోగేశారు. ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన తన వంతుగా రూ.6 కోట్లు సాయం చేశారు. దీంతో పునర్విక వైద్యానికి కావాల్సిన డబ్బు సమకూరింది. మరోవైపు విదేశాల నుండి వచ్చే ఈ ఇంజక్షన్ పై దిగుమతి సుంకం, జీఎస్టీ మినహాయింపు లభించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చొరవ తీసుకున్నారు. అన్ని సజావుగా పూర్తవడంతో పునర్వికకు ఆదివారం హైదరాబాద్ ఆస్పత్రిలో మంత్రి లోకేశ్ దగ్గరుండి ఇంజక్షన్ చేయించారు. ఈ ఫొటోలను ఆయనే తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటోందని, వైద్యుల పర్యవేక్షణలో ఉందని సమాచారం. ఈ పరిణామం తెలుగు రాష్ట్రాల ప్రజల ఐక్యతకు, మంత్రి నారా లోకేశ్ వంటి నాయకుల చొరవకు నిదర్శనంగా వ్యాఖ్యానిస్తున్నారు.



Tags:    

Similar News