వాజ్ పేయి లాంటి లీడర్...బీజేపీకి కూడా మళ్ళీ దొరకరు !

నిజానికి ఒక్క ఓటు కాదు పదుల ఓట్లు లేకపోయినా తెచ్చి అధికారం నిలబెట్టుకునే రాజకీయ సామర్థ్యం ఉన్న నేతల రోజులు ఇవి.

Update: 2026-08-16 17:52 GMT

అటల్ బిహారీ వాజ్ పేయి దేశంలో వరిష్ట నేత, విశిష్ట నాయకుడు. అజాత శత్రువు. అధికారంలో ఉంటే ప్రతిపక్షం మెప్పు పొందుతారు, ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షం ఆయన పట్ల ఎంతో గౌరవం ప్రదర్శిస్తుంది. ఆరున్నర దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది. 71 ఏళ్ళ వయసులో తొలిసారి భారత దేశానికి కాషాయం పార్టీ తరఫున ఆయన తొలిసారి ప్రధాని అయ్యారు. 1996 మే 15న ఆయన ప్రధానిగా ప్రమాణం చేసి కేవలం 13 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు. మెజారిటీ లేక దిగిపోయారు. 1998లో నెగ్గినా 13 నెలలకే ఆయన ప్రభుత్వం కుప్ప కూలింది. ఇక్కడ ఒక్క ఓటు తేడాతో ఆయన ప్రభుత్వం పడిపోవడం జరిగింది.

ఆయన చలవతోనే :

నిజానికి ఒక్క ఓటు కాదు పదుల ఓట్లు లేకపోయినా తెచ్చి అధికారం నిలబెట్టుకునే రాజకీయ సామర్థ్యం ఉన్న నేతల రోజులు ఇవి. అలాంటి వారికి వాజ్ పేయి ఒక వింతగా విశేషంగా కనిపిస్తారు. అయితే ఆయన నిబద్ధత నిజాయతీని చూసి దేశమంతా 1999 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే పక్షాన నెగ్గించి అధికారం చేతిలో పెట్టింది. అలా 2024 మే దాకా ఆయన సుమారు అయిదేళ్ళ పాటు పాలించారు. మొత్తంగా వాజ్ పేయి ప్రధానమంత్రి త్వం ఆరున్నరేళ్ళ పాటు సాగింది. నిజానికి బీజేపీకి కేంద్రంలో అధికారం అంటే వాజ్ పేయి చలవతోనే అని చెప్పాలి. ఆయన ఉదారవాది. నిజాయతీపరుడు, రాజనీతిజ్ఞుడు, రాజధర్మం ఏంటో తెలిసిన వారే కాదు పక్కాగా అమలు చేసిన వారు కూడా.

నెహ్రూ జోస్యం నిజమైంది :

వాజ్ పేయి 1957 లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి గెలిచి నాటి జనసంఘ్ సభ్యుడిగా లోక్ సభలో అడుగు పెట్టారు. జనసంఘ్ కి ఆనాడు ఇద్దరో ముగ్గురో ఎంపీలు ఉండేవారు. అపుడు ఆయన వయసు 32 ఏళ్ళు. అయితే ఈ యువ పార్లమెంటేరియన్ దేశంలోని అన్ని సమస్యలను ఏకరువు పెడుతూ బలమైన ప్రధాని దేశానికి తొలి ప్రధాని అయిన పండిట్ నెహ్రూనే సూటింగా ప్రశ్నించేవారు. అయితే విపక్షంలో కనీస బలం కూడా లేని జన సంఘ్ పార్టీ కదా అని నెహ్రూ చులకనగా చూడలేదు, వాజ్ పేయి మాట్లాడడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఆయన పార్టీకి ఉన్న సంఖ్యా బలం కంటే కూడా అధిక సమయం కేటాయించేలా చూసేవారు. అంతే కాదు యువ వాజ్ పేయి అడిగే ఎన్నో ప్రశ్నలకు ప్రధాని స్థాయిలో నెహ్రూ ఓపికగా జవాబులు చెప్పేవారు. ఇక వాజ్ పేయి రాజకీయ పరిణతి చూసి ఏదో రోజున దేశానికి ప్రధాని అవుతారని కూడా నెహ్రూ జోస్యం చెప్పారు. అది తరువాత కాలంలో నిజమైంది కూడా.

ఇందిరాగాంధీ సైతం :

అంతే కాదు ఉక్కు మహిళ ఇందిరాగాంధీ సైతం వాజ్ పేయిని ఎంతోగానో గౌరవించడమే కాదు ఆయన సలహా సూచనలు తీసుకునే వారు. 1972 సమయంలో పాకిస్థాన్ తో సిమ్లా ఒప్పందం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిని ప్రతిపక్షంలో ఉన్న వాజ్ పేయి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో వాజ్ పేయిని కన్వీన్స్ చేసేందుకు ఇందిరాగాంధీ ఒకసారి ఆయనకు ఫోన్ చేసి చర్చలకు రమ్మని పిలిచారు. వాజ్ పేయి వెళ్ళాక ఇద్దరూ ఇదే విషయం మీద చర్చించుకున్నారు. అయినా సరే వాజ్ పేయి తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు, ఇందిర సైతం వాజ్ పేయి అభిప్రాయం ఎలా ఉన్నా కూడా సిమ్లా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడ చెప్పాల్సింది వాజ్ పేయిని ఆయన అభిప్రాయాలను అంతలా అధికార పార్టీలు గౌరవించాయని చెప్పడమే. రాజీవ్ గాంధీ సైతం వాజ్ పేయి పట్ల అదే ఆదరణ గౌరవం చూపించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయిని ఐక్యరాజ్యసమితికి వెళ్లే భారతీయ ప్రతినిధి బృందంలో సభ్యుడిగా చేర్చారు.

రాజధర్మం అన్న మాట :

ఇక వాజ్ పేయి ప్రధాని గా ఉండగా ఎక్కువగా ఒక మాట వినిపించేది. అదే రాజ ధర్మం. అంటే అధికారంలో ఎవరు ఉన్నా తమ తర భేదం లేకుండా అందరినీ సమానంగా చూడడం. ఆ సమయంలోనే గుజరాత్ అల్లర్ల సందర్భంగా తన సొంత పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు వచ్చినపుడు చర్యలకు వాజ్ పేయి ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. 2002 ఏప్రిల్ లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, పాలకుడు కుల, మత, జాతి బేధాలు చూడకుండా ప్రజలను రక్షించడమే నిజమైన రాజధర్మమని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు రాజధర్మాన్ని పాటించాలని, పౌరులందరికీ భద్రత కల్పించాలని ఆయన హితవు పలికారు.

స్పూర్తి దాతగా :

వాజ్‌పేయి తీసుకున్న విధానం రాజధర్మం అంటే నిష్పాక్షికమైన పాలన అని ఆయన ఆచరణలో చూపించారు.ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని ఆయన భావించారు.కష్టకాలంలోనూ మానవతా విలువలకు, సమన్యాయానికి పెద్దపీట వేయాలని ఆయన నాయకులకు గుర్తుచేశారు. మరి అలాంటి నాయకులు ఈ తరంలో కనిపిస్తారా. వాజ్ పేయి వంటి నాయకుడు బీజేపీకి కూడా మళ్ళీ దొరకడం కష్టం అంటే అది నిజమే కదా అనిపిస్తుంది. 93 ఏళ్ళ పరిపూర్ణ జీవితాన్ని చూసిన వాజ్ పేయి 2018 ఆగస్టు 16న ఈ భువిని వీడి దివికేగారు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా అంతా నివాళి అర్పిస్తున్నారు.

Tags:    

Similar News