మ‌ళ్లీ సెంటిమెంట్‌ను రెచ్చ‌గొడుతున్న తండ్రీకొడుకులు

తాజాగా అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా చివ‌రి రోజు కేసీఆర్, కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌నమ‌ని అంటున్నారు.

Update: 2023-08-07 08:21 GMT

తెలంగాణ‌లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ప‌ర‌డుతున్నాయి. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజ‌యంపై క‌న్నేసిన కేసీఆర్ అందుకు త‌గిన క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఓ వైపు హామీలిస్తూ.. మ‌రోవైపు వ‌రాలు కురిపిస్తూ.. ఇంకోవైపు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ సాగుతున్నారు.

ఈ సారి కూడా ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌న్న‌ది కేసీఆర్ ల‌క్ష్యం. ఆయ‌న త‌న‌యుడు ఐటీ మంత్రి కేటీఆర్ కూడా తండ్రి ల‌క్ష్యం కోసం పాటుప‌డుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు క‌లిసి మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను ర‌గిల్చి ఎన్నిక‌ల్లో ప్ర‌యోజ‌నం పొందాల‌ని చూస్తున్నార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

2014 ఎన్నిక‌ల్లోనూ ఉమ్మ‌డి ఏపీలో తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయాన్ని వివ‌రిస్తూ ప్ర‌చారం చేసిన కేసీఆర్ గెలిచారు. 2018లోనూ మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్ వాడుకున్నార‌నే అభిప్రాయాలున్నాయి.

ఇప్పుడు మ‌రోసారి ఎన్నికలు వ‌స్తుండ‌డంతో సెంటిమెంట్‌ ప్ర‌ధాన అస్త్రంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తాజాగా అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా చివ‌రి రోజు కేసీఆర్, కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌నమ‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్కు పోటీగా కాంగ్రెస్ క‌నిపిస్తోంది. అందుకే కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుని కేసీఆర్‌, కేటీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను మ‌ళ్లీ ముందుకు తీసుకువ‌చ్చార‌ని టాక్‌. ఉన్న తెలంగాణ‌ను ఊడ‌గొట్టిందే కాంగ్రెస్ అని నెహ్రూను కేసీఆర్ విమ‌ర్శించారు. కాంగ్రెస్ కార‌ణంగానే తెలంగాణ‌కు మొద‌ట్లో న‌ష్టం జ‌రిగింద‌ని అన్నారు.

మ‌రోవైపు శాస‌న మండ‌లిలో తెలంగాణ‌కు అన్యాయం చేశాయ‌ని కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీని మంత్రి కేటీఆర్ క‌డిగిపారేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, చంద్ర‌బాబు, కిర‌ణ్ కుమార్ రెడ్డి తెలంగాణ‌ను అవ‌మానించార‌ని కేటీఆర్ అన్నారు.

ఇక ఇప్ప‌టికే బీఆర్ఎస్ మంత్రులు.. ఏపీలోని రోడ్లు, సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి, విద్యుత్‌.. ఇలా చాలా విష‌యాల్లో తెలంగాణ‌తో పోల్చి చూస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News