రుషికొండపై గోవా గవర్నర్ సలహా.. వైసీపీకి ‘మెంటల్’ ఎక్కిస్తోందంట..?
రుషికొండ ప్యాలెస్ పై గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.;
రుషికొండ ప్యాలెస్ పై గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. విశాఖలోని రుషికొండపై పున్నమి రిసార్ట్స్ స్థానంలో గత ప్రభుత్వం నాలుగు విలాస వంతమైన భవనాలు నిర్మించిన విషయం తెలిసిందే. అప్పట్లో విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు తీసుకోకుండా భారీ భవనాలను నిర్మించింది. రుషికొండను చాలా భాగం తొలచి నిర్మించడం వల్ల గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. కోర్టుల్లో కేసులు పడ్డాయి. అయినా అప్పటి ప్రభుత్వం రూ.450 కోట్లతో నాలుగు భారీ భవంతులను నిర్మించింది. ఈ భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత రాష్ట్రంలో అధికారంలో మారిపోవడంతో రుషికొండపై నిర్మాణాలు అత్యంత వివాదాస్పదమయ్యాయి.
రూ.450 కోట్లతో నిర్మించిన భవనాలు ప్రభుత్వానికి దేనికి ఉపయోగపడవని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. అత్యంత విలాసవంతంగా తన సొంత నివాసం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రజల డబ్బుతో ప్యాలెస్ నిర్మించారని ప్రభుత్వ పెద్దలు విమర్శిస్తున్నారు. ఈ భవనాలు ఏం చేయాలో తెలియడం లేదని చెబుతున్నారు. అయితే విశాఖలో పర్యాటకాభివృద్ధి కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆ భవనాలు నిర్మించామని, ప్రతిష్ఠాత్మక భవనాలను వినియోగించడం ప్రభుత్వానికి చేతకావడం లేదని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. ఈ మాటల దాడి మధ్యలో కొద్ది రోజుల క్రితం రుషికొండపై నిర్మాణాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ భవనాలను ఎలా వినియోగించాలనే విషయమై ప్రభుత్వం చర్చిస్తోందని, దీనిపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సివుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రజల నుంచి కూడా సలహాలు కోరారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజల అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు.
ఇక ఉత్తరాంధ్రకు చెందిన గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు దీనిపై స్పందించారు. ప్రభుత్వం సలహా అడుగుతున్నందున తాను ఓ ఉచిత సలహా ఇస్తున్నానని చెబుతూ, రుషికొండ ప్యాలెస్ ను పిచ్చాసుపత్రిగా మార్చాలని సూచించారు. గవర్నర్ హోదాలో అశోక్ గజపతి ఇచ్చిన ఈ సలహా రాష్ట్రంలోని విపక్ష వైసీపీకి మెంటల్ తెప్పిస్తుందని అంటున్నారు. క్షత్రియ సమితి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి తమ పార్టీని టార్గెట్ చేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయన ఇచ్చిన సలహాపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయి విమర్శలు గుప్పిస్తోంది.
ప్రభుత్వం సలహా అడుగుతోంది కాబట్టి నేను ఉచిత సలహా ఇస్తున్నానంటూ అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. రుషికొండపై ఎవరిని బస చేయమన్నా నిద్ర కూడా పట్టదు. అందుకే పిచ్చి ఆస్పత్రిగా మార్చాలని అన్న గవర్నర్ అశోక్ గజపతి రాజు అక్కడితో ఆగకుండా ‘ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతుంది’ అంటూ మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారని అంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన రుషికొండపై కొన్నాళ్లుగా తీవ్రస్థాయి మాటల యుద్ధం జరుగుతోంది. ఈ భవనాల వినియోగంపై సుదీర్ఘంగా తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఐటీ కంపెనీలకు ఇవ్వాలని కొందరు, ఏదైనా స్టార్ హోటల్ గా మార్చేయాలని మరికొందరు సలహాలిచ్చారు. కానీ, గవర్నర్ అశోక్ గజపతిరాజు మాత్రమే ఆస్పత్రిగా చేయాలని, అది కూడా పిచ్చి ఆస్ప్రతి చేయాలని ప్రతిపాదించడం రాజకీయంగా దుమారానికి కారణమవుతోంది.