అత్యున్నత స్థానానికి అశోక్ గజపతి.. త్వరలోనే ప్రకటన
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు కీలక పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది.;

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు కీలక పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధిష్టానం కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తోంది. పార్టీలో చంద్రబాబు సహచరుడిగా సుదీర్ఘ కాలం కొనసాగిన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలగిన ఆయనకు సమున్నత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని, త్వరలోనే అశోక్ గజపతికి అత్యున్నత స్థానం దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది.
విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ గజపతిరాజు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటే 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం ఉన్న ఈ విజయనగరం మహారాజు.. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాం నుంచి అశోక్ పార్టీకి నమ్మకమైన నేతగా కొనసాగుతున్నారు. 1983 నుంచి 2009 వరకు మధ్యలో ఒకసారి తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లో విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అశోక్ గజపతిరాజు టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి మంత్రిగా పనిచేశారు.
టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత నెంబర్ టు స్థానంలో కొనసాగినా, అధిష్టానానికి నమ్మకస్తుడిగా, పార్టీకి పూర్తి విధేయుతతో పనిచేయడం అశోక్ గజపతి రాజు నైజం. అంతేకాకుండా వేల కోట్ల ఆస్తులను ప్రజలకు దానం చేసి రాజవంశీయుడిగా అశోక్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మరక అంటని ఏకైక నాయకుడిగా అశోక్ స్థానం సుస్థిరమంటారు. అదేసమయంలో 2014-18 మధ్య కేంద్ర పౌర విమానయాన మంత్రిగా పనిచేసి ప్రధాని మోదీ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజ్యాంగంపై లోతైన అవగాహన, నిబద్ధత, నిజాయితీ వంటి అదనపు అర్హతలతో అశోక్ ను ప్రధాని మోదీ గౌరవిస్తారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తన చిరకాల సహచరుడి రాజకీయ విరామానికి ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉండేలా రాజ్ భవన్ లో కూర్చోబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని అంటున్నారు. దీంతో త్వరలో జరిగే గవర్నర్ల నియామకాల్లో అశోక్ గజపతి రాజు పేరు కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. వచ్చే నెల తొలి వారంలో దేశంలో నాలుగైదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ లిస్టులో అశోక్ పేరుంటుందని, ఆయనను పక్కనే ఉన్న తమిళనాడు గవర్నర్ గా నియమిస్తారని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఏపీకి చెందిన పలువురు నేతలు తమిళనాడు గవర్నరుగా పనిచేశారు. దీంతో అశోక్ గజపతికి రాజ్ భవన్ రూటు క్లియర్ అయిందని అంటున్నారు.