యనమల వేచి చూడాల్సిందేనా ?

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఇద్దరు సీనియర్ నేతలు ఉన్నారు. వారే పూసపాటి అశోక్ గజపతిరాజు, అలాగే మాజీ స్పీకర్ యనమల రామక్రిష్ణుడు;

Update: 2025-07-14 17:20 GMT

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఇద్దరు సీనియర్ నేతలు ఉన్నారు. వారే పూసపాటి అశోక్ గజపతిరాజు, అలాగే మాజీ స్పీకర్ యనమల రామక్రిష్ణుడు. ఈ ఇద్దరూ బాబుకి కుడి ఎడమలుగా ఉంటూ ఆయన రాజకీయ ఉన్నతికి ఎంతో సహకారం గా ఉంటూ వచ్చారని చెబుతారు.

ఇక చంద్రబాబు సైతం ఈ ఇద్దరికీ ఎపుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే తన ప్రభుత్వాన్ని నడిపారు. అశోక్ యనమల బాబు కేబినెట్ లో తప్పనిసరిగా ఉండేవారు. యనమల అయితే ఆర్ధిక మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు.

అయితే ఈ ఇద్దరూ ఏడు పదుల వయసులోకి వచ్చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం చూశారు. దాంతో 2024లో ఇద్దరూ పోటీ నుంచి తప్పుకుని తమ వారసులకు అప్పగించారు. అలా విజయనగరం నుంచి అశోక్ కుమార్తె అదితి గజపతిరాజు, తుని నుంచి యనమల కుమార్తె ఎమ్మెల్యేలు అయ్యారు.

ఇక యనమలకు ఉన్న ఎమ్మెల్సీ పదవికి ఈ మార్చి తో గడువు పూర్తి అయింది. ఆయనకు అప్పటికే రెండు సార్లు ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చారు. దాంతో రెన్యువల్ చేయలేదని చెబుతారు అయితే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుందామని అనుకున్న యనమల రాజ్యసభ కోసం చూస్తున్నారని చెబుతారు. అలా కాదు అనుకుంటే ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా చేయాలని ఆయనకు ఉంది.

ఇకా ఎన్డీయే మిత్రుల కోటాలో టీడీపీకి ఒక గవర్నర్ పదవి దక్కింది అది యనమల అశోక్ లలో ఎవరికి అన్న చర్చ చాలా కాలంగా ఉంది. దానికి ఇపుడు ఫుల్ స్టాప్ పెడుతూ అశోక్ నే ఎంపిక చేశారు. దాంతో అశోక్ గోవా రాష్ట్రానికి గవర్నర్ గా నియమితులయ్యారు.

దాంతో ఇపుడు అందరి దృష్టి యనమల మీద ఉంది. ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారా లేక రాజ్యసభకు పంపిస్తారా అన్నదే చర్చ. ఇక గవర్నర్ పదవుల విషయం తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు. త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనారెడ్డి తెలంగాణా నుంచి ఉన్నారు. ఏపీ నుంచి హరిబాబు ఒడిశా గవర్నర్ గా ఉన్నారు. ఇక లేటెస్ట్ గా అశోక్ గజపతిరాజు ఏపీ నుంచే మరో గవర్నర్ గా రాజ్ భవన్ లో అడుగుపెడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇంకో గవర్నర్ పదవి ఏపీకి ఇస్తారా అన్నది చర్చగా ఉంది. అలా కనుక జరగకపోతే రాజ్యసభకు యనమలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే రాజ్యసభ కూడా కూటమి పార్టీల మధ్య పంచుకోవాల్సి రావడంతో టీడీపీకి ఒకటీ లేదా రెండు మాత్రమే అవకాశాలు లభిస్తున్నాయి. దాంతో చాలా మంది ఆశావహులు అక్కడ కనిపిస్తున్నారు. దాంతో యనమలకు ఏ పదవి దక్కుతుంది, ఆయన సీనియారిటీకి ఏ విధమైన గౌరవం లభిస్తుంది అన్నది కనుక తెలియాలంటే వేచి చూడాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News