ఇదేం లెక్క? ఓటర్లు ఓటేస్తే ఆ సీఎం జైలుకు వెళ్లరట!

ఈ సందర్భంగా కేజ్రీవాల్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. తనను ప్రజలు ఓట్లేసి ఎన్నుకుంటే మరోసారి తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం రాకపోవచ్చన్నారు.

Update: 2024-05-13 05:30 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లిన ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల బెయిల్ మీద బయటకు రావటం తెలిసిందే. కీలకమైన ఎన్నికల వేళలో జైలులో ఉండాల్సి రావటం ఆయన్ను.. ఆయన పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎట్టకేలకు కోర్టు కనికరించటంతో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేశారు. జైలు నుంచి విడుదలైనంతనే ఎన్నికల ప్రచార బరిలోకి దిగిన ఆయన బిజీబిజీగా ఉంటున్నారు.

తాజాగా తమ పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలిసి ఢిల్లీలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. తనను ప్రజలు ఓట్లేసి ఎన్నుకుంటే మరోసారి తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం రాకపోవచ్చన్నారు. బీజేపీని ఓడించేందుకే దేవుడు తనను జైలు నుంచి బయటకు తీసుకొచ్చారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జనం కోసం పని చేశానని.. అందుకే తనను జైలుపాలు చేశారన్న కేజ్రీవాల్.. "ఢిల్లీలో పనులు పూర్తి కావటం బీజేపీకి ఇష్టం లేదు. నేను మళ్లీ జైలుకు వెళితే బీజేపీ పనులన్నీ ఆపేస్తుంది. ఉచిత విద్యుత్ పథకం.. స్కూళ్లను దెబ్బ తీస్తుంది. ఆసుపత్రులు.. మొహల్లా క్లినిక్ లను మూసేస్తుంది" అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరవై రోజుల్లో తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని.. మే 25న జరిగే పోలింగ్ లో ప్రజలు తమ పార్టీ గుర్తు అయిన చీపురుకు ఓటేస్తే.. తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.

Read more!

మొత్తంగా ఓటర్ల ఓటుకు.. తన జైలుకు లింకు పెట్టిన కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే అధికారంలో ఉండి.. ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న వేళలోనే జైలుకు వెళ్లిన కేజ్రీవాల్.. ఎంపీ ఎన్నికల్లో ఓటు వేసినంతనే జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్న వ్యాఖ్యల్లో లాజిక్ పెద్దగా లేదంటున్నారు. ఎందుకంటే.. జూన్ ఒకటి వరకు సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు కావట తెలిసిందే. జూన్ 2న ఆయన లొంగిపోయి జైలుకు వెళ్లాలని కోర్టు ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెల్లడి కానున్నాయి. ఓటర్లు కేజ్రీవాల్ పార్టీకి ఓటేసినా.. ఓటేయకున్నా ఎన్నికల ఫలితాల వెల్లడి కంటే ముందే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

Tags:    

Similar News