బీజేపీకి కేజ్రీవాల్ సవాల్.. వెంటాడుతున్న మరో కేసు!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నుంచి క్లీన్ చిట్ పొందిన గంటల్లోనే మాజీ సీఎం కేజ్రీవాల్ బీజేపీని ఉద్దేశించి భారీ సవాల్ రువ్వారు.;
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నుంచి క్లీన్ చిట్ పొందిన గంటల్లోనే మాజీ సీఎం కేజ్రీవాల్ బీజేపీని ఉద్దేశించి భారీ సవాల్ రువ్వారు. గత ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలిచారని.. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఇప్పుడు మరోసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. కనీసం పది స్థానాల్లో కూడా బీజేపీ విజయం దక్కించుకోలేదన్నారు. నిజాలను ఎన్నాళ్లో దాచలేరని, అబద్ధాలు ఎక్కువ కాలం నిలబోవని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం ఆయన సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు.
అనేక బాధలు పెట్టారు!
తనను, తన కుటుంబాన్ని కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారని కేజ్రీవాల్ అన్నారు. అయినా.. అన్నింటినీ పంటి బిగువన ఓర్చుకున్నామని, అన్యాయం చేస్తున్నారని, అక్రమాలు మోపుతున్నారని ఆనాడే ప్రజలకు చెప్పానన్నారు. అయినా.. తనపై కేసులు పెట్టి.. జైల్లో ఉంచారని చెప్పారు. తప్పు చేయలేదు కాబట్టే.. ముఖ్యమంత్రి సీటుకు రాజీనామా చేయకుండా జైల్లోనే ఉన్నానని చెప్పారు. మద్యం విధానం పారదర్శకమని.. దీనిలో అక్రమాలు చేసేందుకు కూడా అవకాశం లేదని చెప్పారు. అయినప్పటికీ.. రాజకీయ కుట్ర పూరితంగా ఆమ్ ఆద్మీపార్టీని నాశనం చేయాలని కంకణం కట్టుకుని అక్రమ కేసులు బనాయించారని తెలిపారు.
బీజేపీతో ధ్వంసం..
బీజేపీ పాలనలో ఢిల్లీ నాశనం అయిపోయిందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఏ ఒక్కరూ సుఖంగా లేరన్నారు. సీబీఐ నమోదు చేసిన కేసులో క్లీన్‌చిట్ ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేశారనడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు. అధికారం కోసం ఇంతలా దారి తప్పుతారని.. అక్రమంగా అరెస్టు చేస్తారని ఊహించలేదన్నారు. నాటి పర్యవసానాలను ఢిల్లీ ప్రజలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ధైర్యముంటే దేశ రాజధానిలో మళ్లీ ఎన్నికలు పెట్టాలని సవాల్ రువ్వారు.
వెంటాడుతున్న మరో కేసు!
కాగా..కవిత, కేజ్రీవాల్ సహా 22 మందికి ఢిల్లీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. ఇది సీబీఐ కేసులకు మాత్రమే వర్తించనుంది. మరోవైపు.. వీరిపై ఈడీ అధికారులు నమోదు చేసిన కేసులు కొనసాగుతున్నాయి. వీటిని రద్దు చేయాలని కోరుతూ.. తాము ఢిల్లీ కోర్టును ఆశ్రయించనున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. నాటి మద్యం కుంభకోణం కేసులో కోట్ల రూపాయలను మనీలాండరింగ్ ద్వారా దారి మళ్లించారని ఈడీ అధికారులు వీరిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో కవిత ప్రధమ ముద్దాయిగా ఉండడం గమనార్హం. ఇదిలావుంటే.. ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఆ వెంటనే శుక్రవారం సాయంత్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఇదిలావుంటే.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నట్టు బీజేపీ నాయకులు తెలిపారు.