నా ఒలింపిక్‌ గోల్డ్‌కు వచ్చిన ప్లాట్లన్నీ ఫేక్‌..బల్లెం వీరుడి వేదన

సరిగ్గా ఏడాది కిందట అతడు దేశానికి హీరో.. మరీ ముఖ్యంగా ఒలింపిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో వారి దేశానికి తొలిసారి స్వర్ణ పతకం అందించాడు.;

Update: 2025-07-20 02:45 GMT

సరిగ్గా ఏడాది కిందట అతడు దేశానికి హీరో.. మరీ ముఖ్యంగా ఒలింపిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో వారి దేశానికి తొలిసారి స్వర్ణ పతకం అందించాడు. దీంతో ఆకాశమే హద్దు అన్నట్లుగా అతడిపై ప్రశంసలు.. ఆపై రివార్డుల వర్షం కురిపించారు. కటిక పేదరికం నుంచి వచ్చిన ఆ క్రీడాకారుడు జీవితంలో ఎన్నడూ ఊహించని పేరు.. ఎప్పుడూ అందుకోని గౌరవం పొందాడు.. ఇక ఒలింపిక్స్‌ స్వర‍్ణం నెగ్గినందుకు ఒకదాని వెంట ఒకటి క్యాష్‌ ప్రైజ్‌లు, ప్లాట్లు ప్రకటించారు. దీంతో ఆర్థికంగా తిరుగులేని స్థాయికి చేరతాడని భావించారు. ఏడాది తిరిగాక ఇప్పుడు చూస్తే...?

పాకిస్థాన్‌ నుంచి ఒలింపిక్‌‍్సలో ప్రాతినిధ్యం వహించే అథ్లెట్‌ రావడమే విశేషం. అతడు ఏకంగా స్వర్ణం నెగ్గడం మరింత విశేషం. గత ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించాడు అర్షద్‌ నదీమ్‌. అది కూడా డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌కు చెందిన నీరజ్‌ చోప్రాను అధిగమించి సాధించాడు. వాస్తవానికి ఈసారి కూడా చోప్రాదే గోల్డ్‌ అనుకుటుండగా నదీమ్‌ భారతీయుల కలలను కల్లలు చేశాడు. ఏకంగా 92.97 మీటర్లు బల్లెం విసిరి ఒలింపిక్‌ రికార్డు నెలకొల్పి బంగారు పతకం ఎగురేసుకుపోయాడు. ప్రపంచాన్ని కూడా నివ్వెరపరిచేలా విజయం సాధించిన నదీమ్‌ పాకిస్థాన్‌ జాతీయ హీరోగా నిలిచాడు.

తమ దేశానికి చెందిన అథ్లెట్‌ సాధించిన గొప్ప విజయాన్ని పాకిస్థాన్‌ ప్రజలు గర్వంగా ఫీలయ్యారు. ఇదే సమయంలో నదీమ్‌పై పలు వర్గాల నుంచి రివార్డులు, నగదు ప్రోత్సాహకాలు, ప్లాట్లు ఇస్తామంటూ ప్రకటనల వర్షం కురిసింది. కానీ, ఏడాది గడిచినా ఇంతవరకు తనకు ఒక్క ప్లాట్‌ కూడా చేతికి రాలేదని అతడు వాపోతున్నాడు. క్యాష్‌ ప్రైజులు అన్నీ వచ్చినా.. ప్లాట్‌లు మాత్రం ఒక్కరూ ఇవ్వలేదని వాపోతున్నాడు. ఇప్పుడు తన దృష్టంతా సెప్టెంబరులో జరగనున్న వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ మీదనే ఉందని తెలిపాడు. కాగా, పంజాబ్‌లోని చిన్న పట్టణం మియాన్ చన్నులో పుట్టి పెరిగాడు నదీమ్. ఇతడిది చాలా సాధారణ కుటుంబం. తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ నదీమ్‌పట్టు వదలకుండా ప్రాక్టీస్‌ చేసి జావెలిన్‌త్రోలో దేశానికి బంగారు పతకం అందించాడు. కానీ, తనకు ప్లాట్లు ఇస్తామన్నవారంతా మొహంచాటేశారు. అంటే.. నదీమ్‌ గోల్డ్‌కు వచ్చిన ప్లాట్లన్నీ ఫేక్‌ అన్నమాట. ఇక క్యాష్‌ ప్రైజ్‌ రూపంలో మాత్రం నదీమ్‌ బాగానే లబ్ధిపొందారు. అతడికి రూ.12 కోట్లకు పైగానే డబ్బులు ముట్టినట్లు అంచనా.

Tags:    

Similar News