ఆ అధికారికి ఐదేళ్లు నోఫ్లై లిస్టులో చేర్చేశారు
నిర్దేశించిన లగేజీకి మించి ఉన్నప్పటికి వాటికి చెల్లించాల్సిన రుసుమును చెల్లించే విషయంలో ఆర్మీ అధికారి ఒకరు వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించింది.;
కొద్ది రోజుల క్రితం శ్రీనగర్ విమానాశ్రయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. వెనుకా ముందు చూసుకోకుండా దాడికి పాల్పడటమే కాదు.. తీవ్ర గాయాలకు కారణమైన ఆర్మీ అధికారి విషయంలో డీజీసీఏ స్పందించింది. నిర్దేశించిన లగేజీకి మించి ఉన్నప్పటికి వాటికి చెల్లించాల్సిన రుసుమును చెల్లించే విషయంలో ఆర్మీ అధికారి ఒకరు వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించింది.
అదనపు లగేజీకి డబ్బులు చెల్లించాలని కోరటమే స్పైస్ జెట్ సిబ్బందికి శాపమైంది. తాను అదనపు రుసుము చెల్లించనని గొడవ చేయటమే కాదు.. తీవ్ర ఆగ్రహంతో నలుగురు స్పైస్ జెట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. తన చేతిలోని వస్తువులతో దాడికి తెగబడ్డారు. ఈ పరిణామంతో స్పైస్ జెట్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. సదరు ఆర్మీ అధికారి టికెట్ కు ఏడు కేజీల వరకే లగేజ్ పరిమితి ఉంది.
అందుకు భిన్నంగా 16 కేజీలతో వచ్చిన సదరు అధికారిని లగేజ్ ఛార్జీలు చెల్లించాలని పేర్కొన్నందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. దురుసుగా వ్యవహరించారు. దాడి నేపథ్యంలో అతడిపై ఐదేళ్లు నో ఫ్లై లిస్టులో ఆయన పేరును ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. స్పైస్ జెట్ సిబ్బందిపై దాడి చేసి.. తీవ్రంగా గాయపర్చిన ఉదంతంలో సదరు అధికారిపై శ్రీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఈ దాడి ఘటన గురించి పౌర విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన సదరు సంస్థ ఈ ఆర్మీ అధికారిని ఐదేళ్ల పాటు ఏ విమానంలో ప్రయాణించేందుకు వీల్లేని విధంగా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నో ఫ్లై జాబితాలో సదరు అధికారి పేరును చేర్చినట్లుగా డీజీసీఏ చర్యలు చేపట్టింది. దుందుడుకు తీరును ప్రదర్శించే వారి విషయంలో ఆ మాత్రం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది.