జిల్లా పాలిటిక్స్: పడుతూ లేస్తూ.. 'పశ్చిమ' ప్రయాస
అంతేకాదు.. వరుసగా గెలిచే నియోజకవర్గాలు ఉండి, పాలకొల్లు వంటివి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉన్నాయి.;
రాష్ట్రంలో కూటమి పాలన బాగుందన్న టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో జిల్లాల రాజకీయాలు ఎలా ఉన్నాయి? అనేది కూడా ఆసక్తికర విషయం. ఎందుకంటే.. జిల్లాల్లో నాయకులు.. అక్కడి రాజకీయాలు బాగుం టేనే ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రశాంతత.. మరిన్ని రూపాల్లో పాలనను ముందుకు తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే.. రాజకీయంగా టీడీపీకి మంచి పట్టున్న జిల్లా పశ్చిమ గోదావరి.. ఇక్కడ బలమైన నియోజకవర్గాలతో పాటు.. బలమైన నాయకులు కూడా ఉన్నారు.
అంతేకాదు.. వరుసగా గెలిచే నియోజకవర్గాలు ఉండి, పాలకొల్లు వంటివి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో వైసీపీ హవా సాగిన 2019 ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లాలో పట్టు నిలబెట్టుకుంది. గత ఎన్నికల విసయానికి వస్తే... మెజారిటీ సీట్లను జనసేనకు కేటాయించారు. ఫలితంగా పశ్చిమలో ఎక్కువగా జనసేన నాయకులు కనిపిస్తున్నారు. సరే.. గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. పార్టీలు, జిల్లాలో రాజకీయాలు ఎలా ఉన్నాయన్నది చూస్తూ.. పడుతూ.. లేస్తూ.. అన్నట్టుగా పశ్చిమ ప్రయాస కనిపిస్తోంది.
ఈ జిల్లాలో జనసేన నాయకులకు, టీడీపీ నాయకులకు మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై గత కొన్నాళ్లుగా చర్చ సాగుతూనే ఉంది. అయితే.. పార్టీ నాయకులకు హైకమాండ్లుచేస్తున్న హెచ్చరికలు కలిసివచ్చి.. కొంత వరకు మౌనంగా ఉంటున్నారు. ముఖ్యంగా టికెట్లు త్యాగం చేశామని.. అయినా.. తమను పట్టించుకోవడం లేదని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం బయటకు కూడా వచ్చింది. తాడేపల్లి గూడెం నియోజకవర్గం దీనికి ఉదాహరణ.
అయినా.. కూడా అధిష్టానాలు మాత్రం నాయకులను కలిసి ఉండాలనే చెబుతున్నాయి. దీంతో అప్పుడ ప్పుడు ఇలాంటి ఘటనలు తెరమీదికి వస్తున్నా.. వెంటనే చల్లారుతున్నాయి. మళ్లీ సర్దుబాటు చేసుకుం టున్నారు. అయితే.. ఈ తరహా పరిస్థితి పార్టీలకు ఎలా ఉన్నా.. స్థానికంగా ఉన్న ప్రజలకు మాత్రం ఇబ్బందిగానే ఉంది. నాయకుల మధ్య సఖ్యత లేకపోతే.. రేపు ప్రజలు కూడా వారికి చేరువ కారు. వివాదాలు రావొచ్చు.. కానీ, అవి సుదీర్ఘకాలం కొనసాగితే కష్టమే. పశ్చిమలో పడుతూ..లేస్తున్నా.. ఇవి సుదీర్థకాలం కొనసాగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.