ఏపీ సర్కార్ సంచలనం.. తొలిసారి విద్యుత్ చార్జీలపై ఊహించని నిర్ణయం
ఏపీలో కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా విద్యుత్ చార్జీలను తగ్గించింది.;
ఏపీలో కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా విద్యుత్ చార్జీలను తగ్గించింది. ప్రజలకు దసరా కానుక ప్రకటించింది. 2023లో అప్పటి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను ట్రూ అప్ కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయగా, అదనంగా చెల్లించిన బిల్లులను వచ్చేనెల నుంచి ఏడాది పాటు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రతి యూనిట్ కు 13 పైసలు చొప్పున తగ్గనుంది. మొత్తం రూ.920 కోట్ల రూపాయల మేర విద్యుత్ వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
గత ప్రభుత్వంలో భారీగా పెరిగిన విద్యుత్ చార్జీలను ఇక పెంచమని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వం విధించిన ట్రూ అప్ చార్జీల వల్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా విద్యుత్ బిల్లులు రావడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే గత ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రస్తుత బిల్లుల్లో ఆ మొత్తం వసూలు చేయాల్సివస్తోందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ వల్ల విద్యుత్ కొనుగోలు విషయంలో పొదుపు పాటించడం, ఇచ్చిపుచ్చుకునే విధానం పాటించడం వల్ల ప్రస్తుతం సరసమైన ధరలకు విద్యుత్ లభ్యమవుతోంది. దీంతో కొత్తగా చార్జీల పెంపు, ట్రూ అప్ చార్జీలు వసూలు వంటి విధానాలకు స్వస్తి పలికినట్లైందని అంటున్నారు.
ఇక నవంబర్ నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు గతంలో అధికంగా వసూలు చేసిన ట్రూ అప్ చార్జీలను తిరిగి చెల్లించాలని నిర్ణయించడంతో వచ్చే నెల నుంచి కరెంటు చార్జీలు తగ్గనున్నాయి. యూనిట్ కు 13 పైసలు చొప్పున సర్దుబాటు చేయనుండటంతో తొలిసారిగా ట్రూ డౌన్ విధానం తీసుకువచ్చినట్లైంది. ఇప్పటివరకు ట్రూ అప్ అనే పదాన్ని మాత్రమే విన్న ప్రజలు.. ఇప్పుడు ట్రూ డౌన్ విధానంతో కాస్త ఉపశమనం పొందనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు దాఖలు చేసిన రూ.2,758.76 కోట్ల ట్రూ అప్ మొత్తానికి సంబంధించి ఏపీఈఆర్సీ రూ.1,863.64 కోట్లకు ఆమోదం తెలిపింది. దీంతో రూ.923.55 కోట్లు మిగులు ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు.
ఇలా ట్రూ డౌన్ విధానంలో తగ్గిన చార్జీలను నవంబర్ నుంచి వచ్చే ఏడాది అక్టోబరు వరకు సర్దుబాటు చేయనున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు వినియోగదారులు వినియోగించిన యూనిట్లకు వర్తింపచేసి ఆ మొత్తాన్ని ఇక మీదట రాబోయే బిల్లులో సర్దుబాటు చేస్తారు. అంటే గత ఏడాది 2024 ఏప్రిల్ లో వినియోగదారులు 100 యూనిట్ల విద్యుత్తు వినియోగిస్తే, ఆ 100 యూనిట్లకు 13 చొప్పున సర్దుబాటు చేయగా, మొత్తం బిల్లుపై 13 రూపాయల వరకు తగ్గుతుందని చెబుతున్నారు.