టీచర్లకు టెట్ టెన్షన్.. త్వరలోనే నోటిఫికేషన్

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Update: 2026-06-04 09:30 GMT

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే శాఖా పరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టెట్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సారి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులతోపాటు ఇన్ సర్వీసు టీచర్లు కూడా టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రంలో 2011కు ముందు ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులు అంతా టెట్ అర్హత సాధించాల్సివుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటువంటి వారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఉండటంతో వీరంతా ఈ సారి టెట్ కు దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సారి టెట్ పరీక్షకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఇన్ సర్వీసు టీచర్లకు తప్పనిసరిగా టెట్ అర్హత ఉండాలని సుప్రీం తీర్పుతో రిటైర్మెంటుకు దగ్గరగా ఉన్నవారు సైతం మళ్లీ పుస్తకాలు పట్టుకుని చదవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు.

ఇక జాబ్ కేలండర్ ప్రకారం ఈ ఏడాది అక్టోబరులో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సివుంది. దీనికి కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా టెట్ అర్హత సాధించాల్సివుంటుంది. దీంతో అక్టోబరు లోగా టెట్ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేసేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో టెట్ మార్కులకు ప్రాధాన్యం ఉండటంతో నిరుద్యోగులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు తమ ఉద్యోగాలపై టెట్ కత్తి వేలాడుతుండటంతో ఇన్ సర్వీసు టీచర్లు సైతం టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ఏటా రెండు సార్లు టెట్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటారు. అయితే గత ఏడాది మెగా డీఎస్సీ ప్రకటన వెలువడటం, ఇకపై ఏటా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో టెట్ కు ప్రాధాన్యం పెరిగిపోయిందని అంటున్నారు. మరోవైపు ఇన్ సర్వీసు టీచర్లు కూడా టెట్ అర్హత కోసం పెద్ద ఎత్తున ప్రిపేర్ అవుతున్నారు. దీంతో ఈ సారి గతంలో ఎన్నడూ లేనంత సంఖ్యలో టెట్ కు దరఖాస్తులు పోటెత్తే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News