మాజీ 'హోమ్' మంత్రులు.. అంతే ..!
ఏ రాష్ట్రంలో అయినా హోం మంత్రులుగా చేసిన వారు.. ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు.;
ఏ రాష్ట్రంలో అయినా హోం మంత్రులుగా చేసిన వారు.. ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఇతర శాఖలకు.. హోం శాఖకు ఉన్న తేడా అందరికీ తెలిసిందే. గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి, వసంత నాగేశ్వరరావు, జానారెడ్డి వంటివారు.. హోం శాఖ మంత్రులుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వారి ముద్ర కనిపించేలా చేసుకున్నారు కూడా!. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత.. అటు తెలంగాణలోను.. ఇటు ఏపీలో ఆ తరహాలో ముద్ర వేసుకున్న హోం మంత్రులు ఎవరూ లేరనే చెప్పాలి.
ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి తొలి మహిళా హోం మంత్రిగా పనిచేసినా.. ఆమె కూడా బలమైన ముద్ర వేయలేకపోయారు. కీలక నిర్ణయాలు కూడా తీసుకోలేక పోయారు. ఇక, 2014-19 మధ్య చిన్నరాజప్ప హోం మంత్రిగా పనిచేశారు. కానీ, ఆయన బలమైన ముద్ర వేయలేక పోయారు. ఆ తర్వాత.. వైసీపీ హయాంలో ఇద్దరు మహిళా మంత్రులు హోం శాఖకు వచ్చారు. మేకతోటి సుచరిత, తానేటి వనితలు హోం మంత్రు లుగా చేశారు. అయితే.. వారు ఉన్నప్పుడు కకూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగానే పరిస్థితి మారింది.
సరే.. పదవుల్లో ఉండగా ఎలా ఉన్నా.. ఇప్పుడు వైసీపీ తరఫున హోం మంత్రులుగా పనిచేసిన సుచరిత, వనిత ఏం చేస్తున్నారన్నది ఆసక్తిగా మారింది. పార్టీ కార్యక్రమాలకు వస్తున్నారా? అంటే.. వనిత విషయం లో కొంత మేరకు ఫర్వాలేదని చెప్పుకోవచ్చు. పార్టీ తరఫున అప్పుడప్పుడైనా కార్యక్రమాలకు హాజరు అవు తున్నారు. ఇటీవల చేపట్టి పీపీపీలకు వ్యతిరేకంగా నిరసనలో వనిత పాల్గొన్నారు. కానీ, నియోజకవర్గంలో మాత్రం ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఇంటికే పరిమితం అవుతున్నారు.
ఇక, సుచరిత విషయం దారుణంగా ఉంది. ఆమె అసలు పార్టీలోనే ఉన్నట్టుగా వ్యవహరించడం లేదని నేతలు చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నా.. జగన్ నిర్వహిస్తున్న సమీక్షలకు కూడా రావడం లేదని చెబుతున్నారు. ఇక, నియోజకవర్గంలోనూ ఉండడం లేదని.. హైదరాబాద్‌కే పరిమితం అయ్యారని అంటున్నారు. నిజానికి ఆమె ప్రత్తిపాడు నియోజకవర్గంలో పుంజుకునే అవకాశం ఉన్నా.. ఆదిశగా చర్యలు చేపట్టడం లేదని చెబుతున్నారు. సో.. మొత్తానికి వైసీపీ హయాంలో హోం మంత్రులుగా వెలిగిన వారు..ఇప్పుడు హోంకే పరిమితం కావడం గమనార్హం.