వారందరికీ నిరుద్యోగ భృతి...కూటమి కీలక నిర్ణయం

ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు మూడు వేల రూపాయల వంతున నిరుద్యోగ భృతిని ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.;

Update: 2025-07-13 05:30 GMT

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్ హామీలలో కీలకమైనవి అన్నీ ఉన్నాయి. అవి వివిధ వర్గాలను టార్గెట్ చేస్తూ ఇచ్చిన హామీలు. ఇవి 2024 ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా పనిచేశాయి. అదే విధంగా కూటమికి బంపర్ విక్టరీ సాధ్యమైంది. ఈ నేపథ్యంలో వరసగా ఒక్కో సూపర్ సిక్స్ హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తోంది.

తల్లికి వందనం అమలు అయింది. రైతుల కోసం అన్నదాతా సుఖీభవ అమలు చేయబోతున్నారు. ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేయనున్నారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను కూడా ఇస్తున్నారు ఈ క్రమంలో నిరుద్యోగ యువతకు భృతి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని ఒక హామీ ఉంది. అది ఎప్పటి నుంచి అమలు చేస్తారు అన్నది వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న.

ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు మూడు వేల రూపాయల వంతున నిరుద్యోగ భృతిని ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది నిరుద్యోగ యువత కోసం కాదు అన్నది అంతా అర్ధం చేసుకోవాలి. తాజాగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్నామని చెప్పారు.

అవి ఎవరికి అంటే వేద పండితులకు అని మంత్రి గారు చెప్పారు. ఏపీలో చూస్తే మొత్తం 590 మంది దాకా వేద పండితులు ఉపాధి లేకుండా ఉన్నారని మంత్రి ఆనం ఈ సందర్భంగా తెలిపారు. అందువల్ల వారి కోసం నెలకు మూడు వేల నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.

అయితే దేవాదాయ శాఖ అమలు చేస్తున్న ఈ నిరుద్యోగ భృతి ప్రకటన యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తమకు కూడా నిరుద్యోగ భృతిని ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఏడాది పై దాటింది అని తమకు ఆసరాగా ఆర్ధికంగా ప్రభుత్వం ఈ పధకం అమలు చేయాలని వారు కోరుతున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే నిరుద్యోగ భృతి యువతకు నెలకు రెండు వేలు ఇస్తామని చెప్పింది.

అయితే ఆ హామీని ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే అమలు చేసింది. అది కూడా పరిమితంగానే కావడంతో నిరుద్యోగ యువత దాని మీద పెద్దగా సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఎదుర్కోంది. ఈసారి ఎన్నికల ముందు కాకుండా ఇప్పటి నుంచే అమలు చేయాలని యువత కోరుతున్నారు. ఆ మూడు వేలు ఉంటే తమకు ఎంతో కొంత వెసులుబాటుగా ఉంటుందని అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఒక్కోటీ అమలు చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో నిరుద్యోగ భృతి కూడా అమలు చేస్తారని అయితే దానికి ముహూర్తం ఎపుడు అన్నదే చూస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News