ఇసుక నుంచి బంగారం...ఏపీ దశ తిరిగినట్లే !

మరో వైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం తాజాగా క్రిటికల్ మినరల్ పార్కులు ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కారిడార్ల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు.;

Update: 2026-02-21 01:30 GMT

ఇసుకన తైలం తీయడం కష్టమని సుమతీ శతకకారుడు చెప్పాడు. అది నిజమే కావచ్చేమో. కానీ తైలం ఎందుకు ఏకంగా బంగారమే తీస్తామని అంటున్నారు. ఏపీలో సంపదను పెంచుతామని కూటమి ప్రభుత్వం చెబుతూ వస్తోంది. దాని కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఏ రంగంలో ఏముందో ఎంత మేరకు రాబట్టాల్సి ఉందో స్టడీ చేసి మరీ సంపదను వెలికి తీసేందుకు రెడీ అవుతోంది. అలా ఏపీ రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా రేర్ ఎర్త్ మినరల్ కారిడార్‌ కి పునాది వేస్తోంది.

అపార ఖనిజ వనరులు :

ఏపీలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. వాటిని వెలికి తీసి పూర్తి స్థాయిలో అభివృద్ధికి వినియోగించుకుంటామని అంటోంది. రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకంతో పాటు వేల్యూ ఎడిషన్ అత్యవసరం అని కూటమి ప్రభుత్వం చెబుతోంది. దాంతో ఇంటిగ్రేటెడ్ వేల్యూ చైన్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఏపీలో ఉన్న విలువలైన ఖనిజ సంపదతో రాష్ట్ర భవిష్యత్తును సమగ్రంగా మార్చేలా ప్రణాళికలను రూపొందించవచ్చు అని అంటోంది.

కోస్తా అతి పెద్ద ఆస్తి :

ఏపీ సముద్ర తీరం ప్రాంతంలో ఉంది. ఏకంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాలు కోస్తాలో ఉన్నాయి. అయితే ఇవే ఇపుడు సంపదకు కారణం అవుతున్నాయి అని అంటున్నారు ఉత్తరాంధ్ర సహా నెల్లూరు జిల్లాలోని తడ వరకూ సుమారు 970 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీరంలో అపారమైన సహజ సంపద ఉందని కూటమి ప్రభుత్వం అంటోంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపే అవకాశం లభిస్తుందని చెబుతోంది. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్‌పై ఆధారపడి దాదాపు 102 మిలియన్ టన్నుల నిల్వలతో రాష్ట్ర ప్రభుత్వం 7,762 హెక్టార్లలో ఎనిమిది బీచ్ శాండ్ కలిగి ఉన్న ప్రాంతాలను గుర్తించింది. ఈ ప్రాంతాలను ఏపీఎండీసీకి రిజర్వ్ చేసేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది.

శ్రీకాకుళం నుంచే :

ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి డిపార్ట్ మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీ కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ 97 మిలియన్ టన్నుల నిల్వతో గార మండలంలో 670 హెక్టార్లు, 239 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న రెండు బీచ్ శాండ్ ప్రాంతాలను ఏపీఎండీసీకి మైనింగ్ లీజు మంజూరు చేయడానికి రాష్ట్ర గనులు ఖనిజాల శాఖ సిఫార్సు చేసింది. గార మండలంలో 909 హెక్టార్లకు పైగా ఏకీకృత లీజు కోసం ఏపీఎండీసీకి ఎల్వోఐ జారీ చేసింది. మిగిలిన ఆరు బీఎస్ఎం బేరింగ్ ప్రాంతాల్లో డిపార్ట్ మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీ ఇటీవల 41 మిలియన్ టన్నుల నిల్వలు, ఎచ్చెర్ల రణస్థలం గార మండలాలలో మూడు బీఎస్ఎం బేరింగ్ ప్రాంతాలకు మైనింగ్ లీజులను మంజూరు చేయడానికి ఏపీఎండీసీని నామినేట్ చేసింది. దీంతో చట్టబద్దమైన అనుమతులు పొందే ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది.

బీచ్ ఇసుకలో నిక్షేపాలు :

బీచ్ శాండ్ ఖనిజ నిక్షేపాలతో శ్రీకాకుళం జిల్లాలో అందుబాటులో ఉన్న నాలుగు క్వారీ లీజులు క్వార్జ్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, గ్రావెల్, రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ సహా మాంగనీస్ కోసం కాంపోజిట్ లైసెన్స్ కూడా అమలు చేశారు శ్రీకాకుళం జిల్లాలో పేర్కొన్న ఖనిజాల కోసం 301 లీజులు 1359 హెక్టార్లు, మాంగనీస్ బ్లాక్ 152 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇలా ఏపీలో అత్యంత విలువైన బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్ అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర గనుల శాఖ గుర్తించింది. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఇపుడు రంగం సిద్ధం అయింది.

కేంద్రం నిర్ణయంతో :

మరో వైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం తాజాగా క్రిటికల్ మినరల్ పార్కులు ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కారిడార్ల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు. దేశంలో విలువైన వనరులు ఉన్నప్పటికీ వాటిని ప్రాసెస్ చేసే వ్యవస్థ ఇప్పటిదాకా లేకుండా పోయింది. అయితే ఇపుడు వాటిని ప్రాసెస్ చేసి వేల్యే యాడెడ్ పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వనరుల్ని ఉత్పత్తి చేయడం కాకుండా ఇంటిగ్రేటెడ్ వేల్యూ చైన్ ఏర్పాటు ద్వారా రేర్ ఎర్త్ మినరల్స్ తయారీ వ్యవస్థకు కీలకంగా ఏపీని మార్చేందుకు కూటమి ప్రభుత్వంలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.

మోనోజైట్ నిల్వలలో ఏపీ టాప్ :

ఇక మరో వైపు చూస్తే దేశ వ్యాప్తంగా ఉన్న మోనోజైట్ నిల్వలలో ఏపీలోనే 30 శాతానికి పైగా ఉన్నాయని గనులు ఖనిజాల శాఖ చెబుతోంది. అయస్కాంతాల తయారీకి వినియోగించే నియోడైమియం, ప్రసియోడైమియం ఆధారమైన మోనోజైట్, ఏరోస్పేస్‌లో కీలక భూమిక పోషించే టైటానియం ఇల్మెనైట్, సిరామిక్స్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీలో కీలకంగా ఉపయోగించే జిర్కాన్, పారిశ్రామిక రంగంలో ఉపయోగించే గార్నెట్ సిల్లిమనైట్ లాంటి ఖనిజాలు ఇవన్నీ కూడా ఏపీలోని తీరప్రాంతంలో అత్యంత కీలకంగా లభిస్తున్నాయని అధికారులు గుర్తించారు. బీచ్ ఇసుకలోనే లభించే సంపదను పెంచనుంది. అలాగే రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయనుంది. అంతే కాదు వీటి వినియోగంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉందని కూటమి ప్రభుత్వం అంటోంది.

Tags:    

Similar News