ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే: ఏపీ లో ఈ నియోజ‌క‌వ‌ర్గాలు సో హాట్.. !

ఎంపీ అంటే.. ఎమ్మెల్యేకు ప‌డ‌దు.. ఎమ్మెల్యే అంటే ఎంపీల‌కు ప‌డ‌డం లేదు. ఈ త‌ర‌హా రాజ‌కీయాలు రాష్ట్రంలోని ఐదారు నియోజ‌క‌వ‌ర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.;

Update: 2025-07-29 16:30 GMT

ఎంపీ అంటే.. ఎమ్మెల్యేకు ప‌డ‌దు.. ఎమ్మెల్యే అంటే ఎంపీల‌కు ప‌డ‌డం లేదు. ఈ త‌ర‌హా రాజ‌కీయాలు రాష్ట్రంలోని ఐదారు నియోజ‌క‌వ‌ర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. త‌మ‌ను ఎంపీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఎమ్మెల్యేలు అంటే.. ఎమ్మెల్యేలు పెద్దోళ్లు.. అంటూ ఎంపీలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య రాజ‌కీయాలు వేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయ‌కులు విజ‌యం ద‌క్కించుకు న్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇలాంటి రాజ‌కీయాలు పెరుగుతున్నాయి. దీంతో కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు త‌ర‌చుగా వార్త‌ల్లోకి వ‌స్తున్నాయి.

ఎక్క‌డెక్క‌డ‌?

రాజ‌మండ్రి: రాజ‌మండ్రి పార్లమెంటు స్థానం నుంచి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆమె స్థానిక నాయ‌కుల‌కు దూరంగా ఉంటున్నార‌న్న‌ది ఆది నుంచి ఉన్న చ‌ర్చ. అప్ప‌ట్లో బీజేపీ చీఫ్‌గా ఉండడంతో నిరంత‌రం బిజీగా ఉండేవారు. దీంతో స్థానిక ఎమ్మెల్యేల‌కు అవ‌కాశం ఇచ్చేవారు కాదు. పోనీ.. అటు పార్ల‌మెంటులోనూ.. పురందేశ్వ‌రి గ‌ళం వినిపించారా? అంటే.. అది కూడా చాలా చాలా త‌క్కువ‌గానే ఉంది. దీంతో రాజ‌మండ్రి ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు.. ఎంపీ అప్పా యింట్ మెంటు కోసం వేచి చూస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

అన‌కాప‌ల్లి: బీజేపీ నాయ‌కుడు, గ‌తంలో టీడీపీలోనే ప‌నిచేసిన సీఎం ర‌మేష్ అనకాప‌ల్లి నుంచి గ‌త ఎన్ని కల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ.. చిత్రం ఏంటంటే.. ఆయ‌న కూడా స్థానిక ఎమ్మెల్యేల‌కు దూరంగా ఉంటున్నారట‌. ఈ వ్య‌వ‌హారం.. గ‌తంలోనే చ‌ర్చ‌కు వ‌చ్చింది. త‌మ‌కు క‌నీసం క‌నిపించ‌డం లేద‌ని.. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వ్యాపారాలు, వ్య‌వ‌హారాల్లోనే మునిగి తేలుతున్నా ర‌ని అంటున్నారు. పైగా.. సొంత అజెండాతో ప‌నులు చేస్తున్నార‌న్న చ‌ర్చ కూడా ఉంది. అటు క‌డ‌ప‌, ఇటు తెలంగాణ‌పై ఉన్న శ్ర‌ద్ధ నియోజ‌క‌వ‌ర్గంపై లేద‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

న‌ర‌సాపురం: ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న భూప‌తిరాజు శ్రీనివాస‌వ‌ర్మ‌.. కేంద్రంలో స‌హాయ మంత్రిగా ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గానికి త‌ర‌చు గా వ‌స్తున్నారు. కానీ.. ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం మెండుగా ఉన్న ఆయ‌న స్థానికంగా బీజేపీ నాయ‌కుల‌కు ఇస్తున్న ప్రాధాన్యం.. ఆ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఇస్తున్న ప్రాధాన్యం.. కూట‌మి నాయ‌కుల‌కు ఇవ్వ‌డం లేద‌న్న‌ది చ‌ర్చ‌గా మారింది. అయితే.. వివాదాల‌కు దూరం గా ఉంటున్నారు. అంద‌ర‌నీ క‌లుపుకొని పోతున్నారు. కానీ, స్థానిక స‌మ‌స్య‌ల‌ను మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఈయ‌న‌కు, ఎమ్మెల్యేల‌కు పెద్ద‌గా బాండింగ్ అయితే లేకుండా పోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News