వైసీపీని సరే.. 'వ్యతిరేకత'ను తట్టుకునేదెలా?
ఇది షాకింగ్ పరిణామమే అయినా.. క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలను గుర్తించాలని అభిమానులు, రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.;
పార్టీలు మనవే అయినా.. మనం అభిమానించే నాయకులే అయినా.. ఒక్కొక్క సారి నిజాలు చర్చించక తప్పదు. అభిమానం అనే కళ్లద్దాలు పెట్టుకుని.. నిజాలను గమనించకపోతే.. అభిమానానికి కూడా అర్ధం ఉండదు. ఇప్పుడు ఏపీలో కూటమిని అభిమానించే నాయకులు, కార్యకర్తలు కూడా.. ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీని ఎదుర్కొంటారు, అధికారంలోకి రాకుండా చేస్తారు.. బాగానే ఉంది. కానీ, పెల్లుబుకుతున్న వ్యతిరేకత మాటేంటి? దీనిని ఎలా తట్టుకుంటారు? అంటూ.. అనుకూల వర్గాల్లోనే చర్చ సాగుతోంది.
ఇది షాకింగ్ పరిణామమే అయినా.. క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలను గుర్తించాలని అభిమానులు, రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. వైసీపీని మరోసారి అధికారంలోకి రాకుండా చూస్తామని.. అది ఎలా అధికారంలోకి వస్తుందో కూడా చూస్తామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఓకే.. వైసీపీని అడ్డుకునేందుకు, తన వ్యాఖ్యలతో ఆయన ప్రయత్నం చేయొచ్చు. లేదా.. వైసీపీకి వ్యతిరేకత పెంచి.. ఆ పార్టీని అడ్డుకునే ప్రయత్నం సాగించొచ్చు.
కానీ, క్షేత్రస్థాయిలో రైతులు, మహిళలు, మధ్యతరగతి వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీనిని ఎలా తగ్గించాలనే విషయంపై దృస్టి పెట్టకపోతే.. అది మరింత ప్రమాదకరమని అంటున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు సహా అమరావతి భూముల విషయంలో రైతులు నిప్పులు చెరుగుతున్నారు. భూములు ఇచ్చేది లేదని ఉద్యమాలకు రెడీ అవుతున్నారు. ఇక, నెల నెలా బాదేస్తున్న విద్యుత్ చార్జీలు, స్మార్టు మీటర్ల పేరుతో పెరుగుతున్న సెగతో మధ్యతరగతి వర్గం అల్లాడుతోంది.
ఇక, ఆడబిడ్డ నిధి ఏది? అంటూ.. యువతులు.. మహిళలు.. తాజాగా టీడీపీ నాయకులు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. తల్లికి వందనం పథకం తమకు రాలేదని వందల సంఖ్యలో మహిళలు నిలదీస్తున్నారు. మరోవైపు కూటమి వస్తే.. నిత్యావసర ధరలు తగ్గుతాయని చెప్పారని.. కానీ, పెరుగుతూనే ఉన్నాయని సాధారణ ప్రజలు అంటున్నారు. వైసీపీ ని అడ్డుకున్నంత తేలికగా.. వీరిని అడ్డుకోవడం కష్టం. కాబట్టి. ఇప్పటి నుంచి ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు, విశ్లేషకులు కూడా కోరుతున్నారు.