మొన్న బొండా ఉమ.. ఇప్పుడు సీఐ శంకరయ్య.. కూటమి సర్కారుకు షాకులు

ఈ రెండు ఉదంతాల్ని చూస్తే.. ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా ఇట్టే టార్గెట్ చేయొచ్చా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.;

Update: 2025-09-24 07:30 GMT

ఒక ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న ముఖ్యనేతను అసెంబ్లీలో ఓపెన్ గా అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పిర్యాదు చేసినట్లుగా వ్యాఖ్యలు చేయటమా? అది కూడా.. సదరు ఎమ్మెల్యే ట్రాక్ రికార్డు అంత గొప్పగా లేకుండానే. ఒక ప్రభుత్వాధినేత మీద ఒక సీఐ స్థాయి అధికారి లీగల్ నోటీసులు పంపటం.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. తనకు పరువు నష్టం మొత్తాన్ని చెల్లించాలని నోటీసులు పంపటమా? సదరు అధికారి మాజీ మంత్రి వివేకా హత్య వేళలో పులివెందుల సీఐగా ఉంటూ.. సీబీఐకు నిందితులకు ఆరోపణలు చేసి ఆ తర్వాత వెనక్కి తగ్గిన ట్రాక్ రికార్డు ఉన్నవారు కావటం గమనార్హం.

ఈ రెండు ఉదంతాల్ని చూస్తే.. ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా ఇట్టే టార్గెట్ చేయొచ్చా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఒక ప్రభుత్వం కొలువు తీరినప్పుడు.. అధికారంలో ఉన్న వారి వైపు చూసేందుకు సైతం భయపడే పరిస్థితులు ఉంటాయి. కానీ.. అందుకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకోవటం ఇప్పుడు కూటమి సర్కారు తీరుపై చర్చకు అస్కారమిచ్చినట్లైంది.

మొన్నటికి మొన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే కం తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ మీదా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మీదా చేసిన వ్యాఖ్యల్ని మర్చిపోలేం. తాము ఏదైనా పని మీద పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు)కు వెళ్లి చెబితే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరును చెబుతున్నారంటూ అసెంబ్లీ సాక్షిగా బొండా ఉమ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మిగిలిన విషయాలు ఎలా ఉన్నా..పని తీరులోనూ.. పక్షపాతం లాంటివి ఇసుమంత కూడా లేకుండా పనిని.. పనిలా చేసే పవన్ కల్యాణ్ ను బొండా ఉమ టార్గెట్ చేయటం ఏమిటి? అన్నది చర్చగా మారింది. దీనికి తోడు పీసీబీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న సీనియర్ అధికారి ట్రాక్ రికార్డు క్లీన్ గా ఉండటమే కాదు.. ఆయన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో నమ్ముతారని.. ఆయనకు సన్నిహితుడన్న విషయం అందరికి తెలిసిన సందర్భంలోనూ బొండా ఉమ అసెంబ్లీలో తన గళాన్నివిప్పటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న.

కట్ చేస్తే.. ప్రస్తుతం కర్నూలు రేంజ్ లో వీఆర్ లో ఉన్న సీఐ శంకరయ్య వివేకా హత్య కేసులో తొలుత చెప్పిన మాటలు.. ఆ తర్వాత మారిన అతడి మాటల్ని చూసినప్పుడు విషయాలు ఇట్టే అర్థమవుతాయి. దీనికి తోడు.. ఆయన వైసీపీ ప్రభుత్వం కొలువు తీరిన కొద్దిరోజులకే ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగాయి. నిజానికి కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేసిన అధికారులకు సైతం మంచి పోస్టులు.. కీలక స్థానాల్ని కట్టబెట్టిన వైనంపై పలు మీడియా కథనాలు రావటం.. ఆ వెంటనే నాలుక్కర్చుకున్నట్లుగా ఆ నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవటం తెలిసిందే.

సీఐ శంకరయ్య విషయానికే వస్తే.. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తనను బెదిరింపులకు గురి చేయటంతోనే.. తాను డెడ్ బాడీని పోస్టు మార్టంకు పంపొద్దని.. డెడ్ బాడీ మీద గాయాలు ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని భయపెట్టినట్లుగా చెప్పిన ఆయన.. కోర్టు ముందుకు వచ్చి మాత్రం ఆ విషయాల్ని చెప్పలేదు. వివేకా హత్య కేసు గురించి విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు దాని గురించి ఎంతలా మాట్లాడారో తెలిసిందే.

అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలుత సీబీఐకు వాంగ్మూలం ఇచ్చి..తర్వాత కోర్టు ఎదుటకు రాని శంకరయ్య లాంటి అధికారుల్ని అలా ఎందుకు చేశారన్న ప్రశ్నను సంధించాల్సి ఉంటుంది కదా? అలాంటిదేమీ జరగకపోగా.. తాజాగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపే వరకు విషయం వెళ్లిన తీరు చూస్తే.. కూటమి సర్కారుకే ఎందుకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? అన్నది చర్చ. మొన్న బొండా ఉమ కానీ నేడు సీఐ శంకరయ్య..ఇదే కాకుండా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పలు ఉదంతాల్ని ప్రస్తావిస్తూ.. మెతకదనమే ఇలాంటి పరిస్థితులకు కారణాలుగా చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కూటమి సర్కారు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.

Tags:    

Similar News