బొత్సకు చెక్.. పట్టు బిగిస్తున్న కూటమి!

ఉత్తరాంధ్ర వైసీపీలో తిరుగులేని నేతగా చెలామణి అవుతున్న మాజీ మంత్రి బొత్సను రాజకీయంగా దెబ్బతీయాలని కూటమి నేతలు పావులు కదుపుతున్నారని చెబుతున్నారు.

Update: 2026-06-26 06:36 GMT

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న కూటమి ప్రభుత్వం... విపక్షం వైసీపీని పూర్తి స్థాయిలో దెబ్బతీయాలని వ్యూహం రచిస్తోంది. వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్ష్ కు కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు సిద్ధమయ్యాయని అంటున్నారు. ఇప్పటికే చేరికల కమిటీతో జనసేన పార్టీ రాష్ట్రస్థాయిలో నేతలను చేర్చుకునేలా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ క్షేత్రస్థాయిలో వైసీపీని ఖాళీ చేయించే వ్యూహాన్ని పదునెక్కించిందని అంటున్నారు. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసిన టీడీపీ తొలుత సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర వైసీపీలో తిరుగులేని నేతగా చెలామణి అవుతున్న మాజీ మంత్రి బొత్సను రాజకీయంగా దెబ్బతీయాలని కూటమి నేతలు పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. బొత్స కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాలలో వైసీపీని నిర్వీర్యం చేసేలా కూటమి నేతలు దృష్టి పెట్టారని అంటున్నారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో మూడు నియోజకవర్గాలకు బొత్స కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స, గజపతినగరంలో బొత్స సోదరుడు అప్పలనరసయ్య, నెల్లిమర్లలో బొత్స సమీప బంధువు బడుకొండ అప్పలనాయుడు ఇంచార్జిలుగా ఉన్నారు. ఇక విజయనగరం జిల్లాకు బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జడ్పీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

దీంతో ఈ జిల్లాలో బొత్స వ్యక్తిగత చరిష్మా కూడా ప్రభావం చూపుతుంటుంది. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి నాలుగైదు నియోజకవర్గాలలో సొంత ఓటుబ్యాంకు ఉంటుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో బొత్స వ్యక్తిగత ఓటుబ్యాంకును దెబ్బతీయాలని కూటమి నేతలు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ముందుగా బొత్స సోదరుడు అప్పలనరసయ్య ఇంచార్జిగా ఉన్న గజపతినగరంలో వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించేలా కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా 300 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు చెబుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారిలో మండల స్థాయి నేతలు కూడా ఉండటం గమనార్హం.

గజపతినగరం ఎమ్మెల్యేగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి గెలిచిన మంత్రి కొండపల్లి నియోజకవర్గంలో పట్టుపెంచుకోవాలనే ఉద్దేశంతో బొత్స అనుచరులను టార్గెట్ చేశారని అంటున్నారు. ఎప్పటి నుంచో బొత్సతో సన్నిహితంగా మెలుగుతున్న వారిని టీడీపీలోకి తీసుకురావడం ద్వారా బొత్స కుటుంబ ఆధిపత్యానికి గండికొట్టాలని వ్యూహం రచించారని అంటున్నారు. అటు బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో కూడా సీనియర్ ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని స్థానిక సంస్థలను చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు బొత్స అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు.

ప్రధానంగా నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లిలో ఓ ప్రధాన నేతను పార్టీలోకి తెచ్చేందుకు చర్చలు మొదలయ్యాయని అంటున్నారు. ఇక బొత్స కుటుంబానికి చెందిన నెల్లిమర్లపైనా కూటమి నేతలు ఫోకస్ చేశారని అంటున్నారు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన లోకం మాధవి ఉండగా, బొత్స తమ్ముడు లక్ష్మణరావు, ఆ కుటుంబానికి దగ్గర బంధువు అయిన మాజీ ఏఎంసీ చైర్మన్ చనుమోలు వెంకటరమణ ఇప్పటికే జనసేనలో చేరారు. ఈ ఇద్దరు నియోజకవర్గంలో మరికొందరు వైసీపీ దిగువస్థాయి నేతలతో చర్చిస్తూ జనసేన పార్టీని బలోపేతం చేసేలా పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఈ పరిణామాలతో మాజీ మంత్రి బొత్సకు రాజకీయంగా గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News