సీనియ‌ర్లు వ‌ర్సెస్ జూనియ‌ర్లు.. 15 మాసాలు పూర్తి ..!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలో 80 మంది కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ విష‌యాన్నిస్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు స‌భ‌లోనే ప‌లు మార్లు చెప్పారు.;

Update: 2025-09-12 01:30 GMT

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలో 80 మంది కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ విష‌యాన్నిస్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు స‌భ‌లోనే ప‌లు మార్లు చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన స‌హా బీజేపీలు చాలా మంది యువ‌త‌కు, కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పించాయి. ఇక‌, కూట‌మి హ‌వా నేప‌థ్యంలో ప్ర‌జ‌లు దుమ్ము రేపారు. దీంతో కొత్త‌వారిలో దాదాపు అంద‌రూ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. కొత్త‌వారి కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సేవ‌లు అందుతాయ‌ని.. కొత్త రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌స్తాయ‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ, చిత్రంగా 30-40 నియోజ‌క‌వ‌ర్గాల్లో ముఖ్యంగా కొత్త‌వారు గెలిచిన స్థానాల్లో విమ‌ర్శ‌లు, వివాదాలు వ‌స్తు న్నాయి. సింగ‌న‌మ‌ల నుంచి శ్రీకాళ‌హ‌స్తి వ‌ర‌కు, తాడేప‌ల్లి గూడెం నుంచి తాడిప‌త్రి(తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్నారు) వ‌ర‌కు అనేక వివాదాలు.. విమ‌ర్శ‌లు.. క‌నిపించాయి. వినిపించాయి. అనేక పంచాయ తీలు కూడా జ‌రిగాయి. అయితే.. ఈ కొత్త ఎమ్మెల్యేల దూకుడు ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ త‌మ పార్టీల్లోని సీనియ‌ర్ల‌తోనే వివాదాలు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యాన్ని కొన్నాళ్ల‌కింద‌ట సీఎం చంద్ర‌బా బు.. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌స్తావించారు.

జూనియ‌ర్ల‌ను క‌లుపుకొని పోవాల‌ని.. ప‌వ‌న్ క‌ల్యాణ్ సీనియ‌ర్ నాయ‌కులకు సూచించారు. కానీ.. అస‌లు జూనియ‌ర్లే త‌మ మాట వినిపించుకోవ‌డం లేద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. ఇక‌, టీడీపీలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. సీనియ‌ర్ల‌ను ఎవ‌రూ ఖాత‌రు చేయ‌డం లేద‌ని అంటున్నారు. చీరాల‌లో తొలిసారి గెలిచిన ఎమ్మె ల్యే స్థానికంగా ఉన్న సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోవడం లేద‌న్న వాద‌న ఆది నుంచి ఉంది. ఇక‌, బాప‌ట్ల వంటి చోట్ల సీనియర్లు స‌హ‌క‌రించ‌డం లేద‌న్న వాద‌న ఉంది. ఇలా.. ఏతా వాతా.. సీనియ‌ర్ల కు-జూనియ‌ర్ల‌కు మ‌ధ్య వివాదాలు అయితే.. కొన‌సాగుతున్నాయి.

ఆధిప‌త్య ధోర‌ణి నుంచి అనేక విష‌యాల్లో ఇరు ప‌క్షాలు కూడా విభేదించుకుంటున్నాయి. ఇప్ప‌టికి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 15 మాసాలు పూర్త‌యిన నేప‌థ్యంలో ఇక నుంచి అయినా.. ఈ విష‌యంలో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. గ‌తంలోనే అనేక సార్లు చంద్ర‌బాబు చెప్పినా.. మార్పు క‌నిపించ‌లేదు. ఈ క్ర‌మంలో ఈ నెల‌లో ప్రారంభం కానున్న అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందు జూనియ‌ర్ల‌కు క్లాసులు నిర్వ‌హిస్తామ‌ని స్పీక‌ర్ చెప్పారు. ఈ నేప‌థ్యంలో వారి ప‌నితీరును మార్చేలా దిశానిర్దేశం చేస్తారేమో చూడాల‌ని అంటున్నారు.

Tags:    

Similar News