సినిమాల్లో ఆ ఒక్క మార్పు చేయండి.. మంత్రి దుర్గేశ్ రిక్వెస్ట్
సినీ దర్శకులకు ఏపీ మంత్రి దుర్గేశ్ కీలక సూచన చేశారు. తమ సలహా పాటించే వారికి అవసరమైన సహకారం అందజేస్తామని ఆఫర్ చేశారు.
సినీ దర్శకులకు ఏపీ మంత్రి దుర్గేశ్ కీలక సూచన చేశారు. తమ సలహా పాటించే వారికి అవసరమైన సహకారం అందజేస్తామని ఆఫర్ చేశారు. ఇంతకీ మంత్రి చేసిన సూచన ఏంటంటే.. ఇకపై తెలుగు సినిమాల్లో షూటింగ్ లోకేషన్ పేర్లను కూడా తెరపై ప్రదర్శించాలని, అలా చేయడం వల్ల ఏపీలో అందమైన లొకేషన్లపై ప్రజలకు సమాచారం ఇవ్వడంతోపాటు టూరిజం అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పన జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీ పర్యాటక రంగం అభివృద్ధికి సినిమా పరిశ్రమ ఒక శక్తివంతమైన సాధనంగా మారాలని మంత్రి కందుల దుర్గేశ్ కోరారు.
రాష్ట్రంలోని అందమైన లొకేషన్లను ప్రపంచానికి పరిచయం చేయడంలో దర్శకులు కీలక పాత్ర పోషించాలని మంత్రి దుర్గేశ్ ఆకాంక్షించారు. సాధారణంగా సినిమాల్లో అందమైన ప్రదేశాలను చూసినప్పుడు ప్రేక్షకులు అవి ఎక్కడ ఉన్నాయో? తెలుసుకోడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే మంత్రి దుర్గేశ్ చిత్ర దర్శకులకు ఒక సరికొత్త సూచన చేశారు. సినిమాలో ఏదైనా సీన్ వస్తున్నప్పుడు, ఆ షూటింగ్ జరిగిన ప్రాంతం పేరును తెరపై ప్రదర్శించాలని కోరారు. దీనివల్ల ఆయా ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
చిన్న మార్పు పెద్ద ప్రయోజనం!
మంత్రి సూచనలతో సినీ దర్శకులు చేసే చిన్నమార్పు వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఏపీలో చాలా ప్రాంతాలు సినిమా షూటింగులకు అనుకూలంగా ఉంటుంది. వైజాగ్, అరకు, కోనసీమ ప్రాంతం, మారేడుమిల్లి, శేషాచలం అడవులలో ఎక్కువగా షూటింగులు జరుగుతుంటాయి. అయితే ఇప్పటివరకు ఆయా ప్రాంతాల అందాలను తెరపై చూసి ఆనందించడమే కానీ, ప్రేక్షకులు వాటి వివరాలను తెలుసుకోలేకపోయేవారు. కానీ, మంత్రి సూచన అమలు చేస్తే సినిమా చిత్రీకరించిన ప్రాంతం ఎక్కడ ఉందో ప్రేక్షకులు తెలుస్తుంది. దీంతో వారు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే పర్యాటక అభివృద్ధి జరుగుతుందని, తద్వారా స్థానికులకు ఉపాధి కలుగుతుందని అంటున్నారు.
అలా చేస్తే సహకారం
ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్స్ జరుపుకునే చిత్రాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని, దర్శకులు తమ సినిమాల్లో ఏపీ లొకేషన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కోరారు. కేవలం అందమైన విజువల్స్ మాత్రమే కాకుండా, అవి ఏ ప్రాంతానికి చెందినవో చెప్పడం ద్వారా ఆ ప్రదేశాల అభివృద్ధికి దర్శకులు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి చేసిన ఈ వినూత్న ప్రతిపాదనపై సినీ రంగం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ ఇది అమలైతే, భవిష్యత్తులో మన ఏపీలోని కోనసీమ అందాలు, అరకు లోయలు, రాయలసీమ కోటలు వెండితెరపై మరింత స్పష్టంగా ప్రపంచానికి పరిచయం కావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.