తెలివైన క్రిమినల్ రాజ్ కసిరెడ్డి : విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
శుక్రవారం మధ్యాహ్నం సిట్ పోలీసులు విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.;
ఏపీ లిక్కర్ స్కాంపై వైసీపీ మాజీ నేత వి.విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా ఊహించినట్లే మద్యం స్కాం లోగుట్టు మొత్తం సిట్ అధికారులకు చెప్పేసినట్లు మీడియా ముందు ప్రకటించారు. మద్యం స్కాంలో బిగ్ బాస్ అంటే తనకు తెలియదని చెప్పిన విజయసాయి.. స్కాం జరిగింది? లేనిది సిట్ తేల్చుతుందని చెప్పారు. కుంభకోణంపై ఎదైనా తెలుసుకోవాలంటే రాజ్ కసిరెడ్డిని మాత్రమే అడగాలని విజయసాయిరెడ్డి చెప్పారు. దీంతో రాజ్ కసిరెడ్డిని ఇరికించేలా విజయసాయి వ్యవహారం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం సిట్ పోలీసులు విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మద్యం స్కాంతోపాటు తన వ్యక్తిగత రాజకీయ జీవితం, వైసీపీలో గతంలో తన పనితీరుపైనా కీలక విషయాలు వెల్లడించారు. మద్యం స్కాం మొత్తాన్ని కసిరెడ్డి రాజ్ రెడ్డి నడిపించారని మరో సారి కుండ బద్ధలు కొట్టారు. 2018లో పార్టీలోకి వచ్చిన రాజ్ కసిరెడ్డిని తానే పార్టీలో ప్రోత్సహించానని, కానీ అతడు తెలివైన క్రిమినల్ అని తెలుసుకున్నాక బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. పార్టీ పెద్దల సూచనలతో కసిరెడ్డిని అన్ని విధాలా ప్రోత్సహించామని విజయసాయిరెడ్డి వివరించారు.
కసిరెడ్డితోపాటు మరో ఆరుగురు కలిసి మద్యం వ్యవహారాలను పర్యవేక్షించేవారని వెల్లడించారు. కసిరెడ్డి ఆయన తోబుట్టువు అవినాశ్ రెడ్డి, చాణక్య, కిరణ్, సునీల్, సైఫ్ ఈ నెట్ వర్కులో ఉన్నారని వివరించారు. వైసీపీలో తాను నెంబర్ టు పొజిషనల్ ఉన్నందు వల్ల మద్యం స్కాం కోసం తనకు అంతా తెలుసు అని మీడియా ప్రచారం చేస్తోందని వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. అయితే మీడియా అనుకున్నట్లు తనకు వైసీపీలో నెంబర్ 2 స్థానం లేదని, ఈ విషయాన్ని తమ మాజీ అధినేత జగన్ ఎప్పుడో చెప్పారన్నారు. ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 1 మాత్రమే ఉంటారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వంద నెంబర్లు వరకు ఎవరూ ఉండరని చెప్పిన విజయసాయి.. వైసీపీలో తన స్థానం 2 వేల స్థానానికి పడిపోయిందని చెప్పారు.
మద్యం స్కాంపై సీఐడీ అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానమిచ్చానని, మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ స్టేట్మెంట్ ప్రకారం తనను సీఐడీ ప్రశ్నించిందని తెలిపారు. వాసుదేవరెడ్డి నిజం చెబితే తాను నిజం చెప్పినట్లే భావించాలని అన్నారు. రాజ్ కసిరెడ్డి పాత్రపై సిట్ అడిగిన ప్రశ్నలు అన్నింటికి సమాధానం చెప్పానని తెలిపారు. ఇక తన రాజకీయ విరామంపైనా సాక్షిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను ఏర్పాటు చేసిన సంస్థలోనే తనపైనే వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.