లిక్కర్ డెన్ నుంచి రూ.5 కోట్లు కాజేసిన కిలేడీ.. ఆ డబ్బు తెప్పించలేక సిట్ పాట్లు!

నిందితుల ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నా, ఈ ప్రక్రియలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున.. వారి నుంచి డబ్బు వసూలు చేయాడానికి తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.;

Update: 2025-12-01 02:30 GMT

ఏపీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఓ దొంగల ముఠా నుంచి డబ్బు వసూలు చేయడం సవాల్ గా మారిందని అంటున్నార. ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో వైసీపీలోని పలువురు కీలక నేతలతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ స్థాయి అధికారులను సిట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిందితులు డబ్బు దాచిన డెన్ నుంచి రూ.కోట్లు కొట్టేసిన ఓ దొంగల ముఠాను సిట్ అదుపులోకి తీసుకుంది. అయితే వారి నుంచి డబ్బు రికవరీ చేయడం మాత్రం పోలీసులకు సాధ్యపడటం లేదని ప్రచారం జరుగుతోంది. నిందితుల ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నా, ఈ ప్రక్రియలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున.. వారి నుంచి డబ్బు వసూలు చేయాడానికి తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

లిక్కర్ స్కాంలో కమీషన్లుగా తీసుకున్న డబ్బును నిందితులు హైదరాబాదులో రకరకాల ప్రదేశాల్లో దాచారు. ఇలా ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి సన్నిహితుల వ్యవసాయ క్షేత్రంలో దాచిన రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా కేసిరెడ్డి మరో సహచరుడు లిక్కర్ స్కాం నిందితుడైన సైమన్ ప్రసన్న, ఆయన బావమరిది మరో నిందితుడు మోహన్ కొల్లిపురి ఇంట్లోనూ డబ్బు దాచారు. అట్టపెట్టెల్లో దాచిన ఈ డబ్బులో సుమారు రూ.5.8 కోట్లు అపహరణకు గురైందని సిట్ పోలీసులకు నిందితులు తెలిపారు. ఆ చోరీ చేసిన వారు ఎవరన్నది తెలిసినప్పటికీ దొంగ డబ్బు కావడంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయామని సిట్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వారిచ్చిన సమాచారంతో సిట్ పోలీసులు దొంగతనం చేసిన ఒడిశాలోని కటక్ ప్రాంతానికి చెందిన మహిళను ఆమె ప్రియుడు, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. సిట్ పోలీసులకు ఇక్కడి నుంచే సవాళ్లు ఎదురైనట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం ఆరు అట్టపెట్టెల్లో పెట్టిన రూ.5.80 కోట్లను ఒడిశా మహిళ రష్మిత ఆమె ప్రియుడు ఈర్షద్, అతడి స్నేహితుడు ముబారక్ అలీ పథకం ప్రకారం చోరీ చేశారు. ఆ డబ్బును సమంగా పంచుకుని హైదరాబాద్, కటక్ నగరాల్లో స్థిరాస్థులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. లిక్కర్ స్కాం నిందితులు ఇచ్చిన సమాచారంతో సిట్ పోలీసులు ఒడిశా మహిళతోపాటు ఆమె గ్యాంగును గతంలోనే అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. వారు కూడా డబ్బు దోచుకున్న విషయం అంగీకరిస్తూ వాటిని ఏం చేశారో పోలీసులకు వివరించారని అంటున్నారు.

అయితే చోరీ నిందితులను పట్టుకున్న సిట్.. వారిపై ఫిర్యాదు లేకపోవడంతో ఇంతవరకు అరెస్టు చేయలేకపోయింది. అంతేకాకుండా వారి పేరుతో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోలేకపోయిందని కూడా అంటున్నారు. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్న సిట్ పోలీసులు.. చోరీ కేసు నిందితులే ఆ ఆస్తులు అమ్మి డబ్బు తెచ్చి ఇవ్వాల్సిందిగా చెబుతున్నారు. నిందితులు సైతం ఆ ప్రతిపాదనకు అంగీకరించారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిందితులు తమ పేరిట ఉన్న ఆస్తులను ఎప్పుడు విక్రయిస్తారు? ఎంత డబ్బు తిరిగిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News