లిక్కర్ స్కాంతో ఫిలింనగర్ కి లింకు..? షాక్ లో టాలీవుడ్ వర్గాలు..

ఏపీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు షాక్ తిన్నాయని ప్రచారం జరుగుతోంది.;

Update: 2025-04-23 10:23 GMT

ఏపీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు షాక్ తిన్నాయని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి అలియాస్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్యం వ్యాపారంతోపాటు సినీ నిర్మాణ రంగంలోనూ పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలు నిర్మించి విడుదల చేసిన కేసిరెడ్డి.. మరికొన్ని చిత్రాలకు అడ్వాన్సులు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు కేసిరెడ్డి అరెస్టుతో ఆ ప్రాజెక్టులు అన్నీ కోల్డ్ స్టోరీజ్ కి చేరినట్లే అన్న టాక్ వినిపిస్తోంది.

ఏపీ లిక్కర్ స్కాంపై పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో రాజకీయాలతో పూర్తిస్థాయిలో మమేకమైన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా షేక్ అవుతోంది. ఇప్పటికే పలు వివాదాలకు కేంద్రంగా టాలీవుడ్ మారిందని అంటున్నారు. పరిశ్రమలోని కీలక వ్యక్తులు వెనక ముందు చూడకుండా తీసుకుంటున్న నిర్ణయాలతో చిక్కుల్లో పడుతున్నారని అంటున్నారు. ఇటీవల బెట్టింగు యాప్స్ ప్రయోషన్లు చేశారని పలువురు నటీనటులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుండగానే ప్రముఖ హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసలు జారీ చేయడం కలకలం రేపింది. ఇదే సమయంలో కేసిరెడ్డి అరెస్టు టాలీవుడ్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.

వైసీపీ నేతగా అందరికీ తెలిసిన రాజ్ కసిరెడ్డి.. గత ప్రభుత్వంలో లిక్కర్ వ్యాపారం పర్యవేక్షించావరని ప్రత్యేక దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై నమోదైన కేసులో అరెస్టు అయిన ఆయన గతంలో రెండు సినిమాలు తీశారని చెబుతున్నారు. తొలుత హీరో సుమంత్ తో రెడ్ అనే సినిమాను కేసిరెడ్డి నిర్మించారని చెబుతున్నారు. ఆ తర్వాత ఈడీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానరును ప్రారంభించి నిఖిల్ సిద్ధార్థ్ తో స్పై చిత్రాన్ని నిర్మించారని అంటున్నారు. ఈ సినిమాకి కార్పొరేట్ ఇమేజ్ తీసుకురావటానికి ప్రత్యేకంగా ఉప్పలపాటి చరణ్ తేజ్ ను సీఈవోగా నియమించారని చెబుతున్నారు. అయితే ఆ తర్వాత హీరో నిఖిల్ తో వివాదాలు రావడంతో స్పై సినిమా పెద్దగా ప్రచారం లేకుండానే విడుదలైంది.

ఇలా తీసిన రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో నష్టాలు పూడ్చుకునేందుకు కేసిరెడ్డి మరిన్ని సినిమాలు తీయాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. పోయిన చోటే వెతుక్కోవాలని భావించిన కేసిరెడ్డి.. ఓ బ్యాడ్మింటన్ క్రీడాకారుడి బయోగ్రఫీని స్టోరీగా చేసుకుని సినిమా తీయాలని నిర్ణయించారని అంటున్నారు. అదేవిధంగా మెగా కాంపౌడ్ తోనూ కొన్ని చర్చలు జరిపారని చెబుతున్నారు. అయితే అవేవీ ఫలించలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయన కొన్ని సినిమాల కోసం అడ్వాన్సులు చెల్లించారని ఈ వివరాలు అన్నీ మున్ముందు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. లిక్కర్ స్కాంలో అవినీతి మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తే, తమకు అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బును మళ్లీ వెనక్కి ఇవ్వాల్సివస్తుందా? అన్న టెన్షన్ కూడా టాలీవుడ్ వర్గాల్లో కనిపిస్తోందంటున్నారు


Tags:    

Similar News