లిక్కర్ కేసులో నిందితులకు మళ్లీ షాక్.. ఏమైందంటే...?
ఏపీ లిక్కర్ స్కాంలో రిమాండులో ఉన్న ఏడుగురు నిందితులకు ఏసీబీ కోర్టు షాకిచ్చింది.;
ఏపీ లిక్కర్ స్కాంలో రిమాండులో ఉన్న ఏడుగురు నిందితులకు ఏసీబీ కోర్టు షాకిచ్చింది. రెగ్యులర్ బెయిలు కోసం నిందితులు వేసిన పిటిషన్ ను తిరస్కరించింది. అంతేకాకుండా వచ్చేనెల 7వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బెయిలు వస్తుందని ఎంతగానో ఆశ పడిన నిందితులు ఉసూరుమన్నారు. ఇప్పటికే ఐదుగురు నిందితులు బెయిలు వచ్చినందున తమకు కూడా కచ్చితంగా బెయిలు వస్తుందని నిందితులు ఎదురుచూశారు. కానీ, న్యాయస్థానం వారి పిటిషన్లను తిరస్కరించడంతో మరికొన్నాళ్లు జైలు జీవితం అనుభవించక తప్పదని అంటున్నారు.
లిక్కర్ కేసులో మొత్తం 12 మంది నిందితులను సిట్ అరెస్టు చేసింది. వీరిలో వైసీపీ ఎంపీ, ఏ4 పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పతోపాటు మరో నిందితుడికి ఇప్పటికే రెగ్యులర్ బెయిలు మంజూరైంది. ఇంకా ఏడుగురు నిందితులు విజయవాడ, గుంటూరు జైళ్లలో రిమాండులోనే ఉన్నారు. అయితే ఐదుగురు నిందితులకు బెయిలు రావడంతో వీరు కూడా తమకు త్వరలో బెయిలు వస్తుందని ఆశించారు. అంతేకాకుండా తమకు ములాఖత్ లో కలిసిన వారితో కూడా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు.
అయితే, ఊహించని విధంగా ఏడుగురు నిందితులకు బెయిలు నిరాకరిస్తూ ఏసీబీ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిందితులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, వెంకటేశ్ నాయుడు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. వీరంతా ఈ వారం బెయిలు వస్తుందనే ఆలోచనతో ఉన్నట్లు వారి సన్నిహితులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం బెయిలు పిటిషన్లను కోర్టు కొట్టివేసిందని తెలుసుకుని నిరాశ చెందారు.
ఏసీబీ కోర్టు బెయిలు పిటిషన్లను తిరస్కరించడంతో నిందితులు హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగులోకి తీసుకువచ్చిన లిక్కర్ స్కాంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. కొద్దిరోజుల వరకు అరెస్టులతో హడలెత్తించిన సిట్ పోలీసులు ప్రస్తుతం నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సేకరించే పనిలో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో బిగ్ బాస్ పై ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తు నెమ్మదించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిందితులకు బెయిలు వచ్చేస్తుందని న్యాయవాద వర్గాలు ఊహించాయి. కానీ, సిట్ వాదనలు బలంగా ఉండటంతో నిందితుల రిమాండ్ పొడిగించడానికే కోర్టు మొగ్గుచూపింది. ఈ పరిస్థితుల్లో తదుపరి దర్యాప్తు, సిట్ యాక్షన్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.