లిక్కర్ స్కాంలో జగన్ సోదరుడు..? రెండు రోజులుగా సిట్ సోదాలు

హైదరాబాద్, విశాఖపట్నంలో జగన్ మరో సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలకు నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది.;

Update: 2025-09-20 14:14 GMT

ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు పెంచింది. మద్యం అమ్మకాల్లో కమీషన్ దండుకున్నారనే ఆరోపణలతో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసిన సీఐడీ సిట్ తాజాగా మాజీ సీఎం జగన్ పెదనాన్న కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించింది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు శనివారం సాయంత్రం ముగిసినట్లు సిట్ ప్రకటించింది. హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నంలో ఉన్న వైఎస్ అనిల్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి. మూడు నగరాల్లో 8 చోట్ల సిట్ సోదాలు నిర్వహించింది. కీలక డేటాను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అనిల్ రెడ్డి బ్యాంకు ఖాతాలను చూసే అకౌంటెంట్లు, ఆడిటర్లను విచారణకు రమ్మంటూ నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్, విశాఖపట్నంలో జగన్ మరో సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలకు నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం ఆధారంగానే సిట్ బృందాలు చెన్నై, హైదరాబాద్‌లో అనిల్ రెడ్డి నివాసాలు, కంపెనీలపై సోదాలు చేపట్టింది. చెన్నైలోని ఆల్వార్ పేట, విజిపి లేఅవుట్‌లోని అనిల్ రెడ్డి నివాసాలపైనా దాడులు నిర్వహించాయి సిట్ బృందాలు. మద్యం ముడుపులను బ్లాక్‌ను వైట్‌గా మార్చుకునేందుకు ఈ కంపెనీల ద్వారా విదేశాల్లోని షెల్ కంపెనీలకు పంపారని సిట్ భావిస్తోంది.

2019 నుంచి 2024 వరకు ఈ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులు, అనిల్ రెడ్డి కొనుగోలు చేసిన ఆస్తులు, నిధులు ఎక్కడ నుంచి వచ్చాయనే అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. చెన్నై, హైదరాబాద్ లో ఉన్న ఏడు బృందాలు ఈ రోజు రాత్రికి విజయవాడ చేరుకునే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి డేటాను విశ్లేషించి తదనంతర దర్యాప్తును చేపట్టాలని సిట్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మాజీ సీఎం సన్నిహితులు, సమీప బంధువులపై సిట్ ఫోకస్ చేయడంతో తర్వాత ఏం జరుగుతుందనే వైసీపీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి.

లిక్కర్ స్కాంలో ఇప్పటి వరకు మాజీ సీఎం జగన్ చుట్టూ ఉన్నవారిని సిట్ అరెస్టు చేసింది. జగన్ కు అత్యంత సన్నిహితులైన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అప్పటి సీఎంవో అధికారులు ధనుంజయరెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. అదేవిధంగా జగన్ సతీమణి భారతిరెడ్డి కంపెనీ ఆడిటర్ బాలాజీ గోవిందప్పను సైతం అరెస్టు చేశారు. ఇప్పుడు ఏకంగా జగన్ బంధువుల ఇళ్లలో సోదాలు చేయడం ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో జగన్ సోదరులను కూడా విచారిస్తారా? వారికి వ్యతిరేకంగా ఏమైనా ఆధారాలు లభించాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సివుంది.

Tags:    

Similar News