ముగ్గురు ముగ్గురే.. ఆంధ్రాలో అధికారం.. ఉండేది హైదరాబాద్ లోనా?

దీంతో గన్నవరంలో ఎక్కే విమానం.. హైదరాబాద్ లో దిగే విమానం అన్నట్లుగా మారింది. వీకెండ్లు మాత్రమే కాదు.. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక విమానాల్లో తరచూ వెళ్లి వస్తున్న తీరు పాలనకు ఆటంకంగా మారిందన్న మాట వినిపిస్తోంది.;

Update: 2025-10-01 06:38 GMT

ఆంధ్రప్రదేశ్ పాలకుల తీరు గురుంచి ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా సైన్యం రక రకాల విశ్లేషణలు చేస్తుంది . అధికారం చేతికి ఇచ్చిన తర్వాత.. అనుక్షణం ఆలోచించాల్సిన రాష్ట్రాన్ని వదిలేసి.. తరచూ పక్క రాష్ట్రంలోని రాజధానికి వెళ్లి సేదతీరటం ఏమిటి? అన్నదిప్పుడు చర్చగా మారింది. దేశంలోని మరే రాష్ట్రంలోని ఇంకే ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి వ్యవహరించని రీతిలో ఉన్న వీరి తీరు హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి కుమారుడు కం కీలక మంత్రి ముగ్గురు.. ముగ్గురే అన్నట్లుగా తరచూ హైదరాబాద్ కు వెళుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో గన్నవరంలో ఎక్కే విమానం.. హైదరాబాద్ లో దిగే విమానం అన్నట్లుగా మారింది. వీకెండ్లు మాత్రమే కాదు.. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక విమానాల్లో తరచూ వెళ్లి వస్తున్న తీరు పాలనకు ఆటంకంగా మారిందన్న మాట వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటివరకు చంద్రబాబు 70 సార్లు హైదరాబాద్ కు వెళ్లి వస్తున్నట్లుగా లెక్కలు కట్టి మరీ చెబుతున్నారు.

ఈ తీరుపై సోషల్ మీడియాలో మాత్రమే కాదు.. ఈ అంశాన్ని విపక్షం ఒక అస్త్రంగా వాడుతోంది. మొన్న ముగిసిన ఆదివారం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ కు వెళ్లి రావటంతో 71వ సారి విజయవంతంగా ముగిసినట్లుగా విపక్ష మీడియా హైలెట్ చేసి మరీ చెబుతోంది. ఇక.. గడిచిన 16 నెలల్లో ఏపీ మంత్రి నారా లోకేశ్ హైదరాబాద్ కు 77 సార్లు వెళ్లి వచ్చినట్లుగా చెబుతున్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం హైదరాబాద్ వేదికగానే అన్ని పనులు చక్కబెడుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఆయన ఏపీలో ఉంటున్న రోజులు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. ఆరోగ్యం బాగోలేని వేళ కూడా.. చికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లే కన్నా.. ఏపీలోని ఏదైనా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే బాగుండేదన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. ఈ పంచ్ లకు కూటమి ప్రభుత్వాధినేతలు ఎలాంటి సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News