కర్నూలులో హైకోర్టు బెంచ్ దిశగా అడుగులు !
హైకోర్టు బెంచ్ అన్నది కర్నూల్ కి రావడం అన్నది సాంకేతికపరమైన అంశాల మీద ఆధారపడి ఉంది అంటున్నారు.;
ఏపీలో మరో కీలక పరిణామం జరగబోతోంది. రాయలసీమకు ముఖద్వారంగా ఉన్న కర్నూలులో తొందరగా హైకోర్టు ఏర్పాటుకు వడి వడిగా అడుగులు పడుతున్నాయా అన్న చర్చ సాగుతోంది. ఏపీ రాష్ట్రం ఆవిర్భావం వెనక శ్రీభాగ్ ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం రాజధాని అయినా లేదా హైకోర్టు అయినా కర్నూల్ కి ఇవ్వాలి. అయితే రాజధాని అమరావతిలో ఏర్పాటు అయింది. హైకోర్టు సైతం అమరావతిలోనే ఉంది. దాంతో కర్నూల్ కి అన్యాయం చేయకుండా హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొందరలోనే అది సాకారం అవుతుందని అంతా భావిస్తున్నారు.
మంత్రి కీలక వ్యాఖ్యలు :
ఇదిలా ఉంటే కర్నూల్ లో హైకోర్టు బెంచ్ విషయంలో జిల్లాకు చెందిన మంత్రి టీజీ వెంకటేష్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కర్నూల్ ఏబీసీ క్యాంప్ క్వార్టర్స్ లో హై కోర్టు బెంచ్ ని ఏర్పాటు చేస్తామని తాజా పర్యటనలో ప్రకటించారు. అది ప్రభుత్వ క్వార్టర్స్ అని మంత్రి అంటూ అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా అక్కడ అలాంటి పనులు ఇక మీదట చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు అవసరం అయితే గట్టిగా వ్యవహరిస్తామని అన్నారు.
వచ్చేసినట్లేనా :
హైకోర్టు బెంచ్ అన్నది కర్నూల్ కి రావడం అన్నది సాంకేతికపరమైన అంశాల మీద ఆధారపడి ఉంది అంటున్నారు. దీని మీద అత్యున్నత న్యాయ స్థానం నిర్ణయం తీసుకుంటే ఆ మీదట రాష్ట్రపతి ఉత్తర్వులతో అవుతుందని అంటున్నారు. కేంద్రం ఎటూ సానుకూలంగా ఉండడంతో ఈ ప్రక్రియ అన్నది సజావుగానే సాగుతుందని అంటున్నారు. కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే అక్కడ కేసులు ఎన్ని ఉన్నాయి ఏమిటి అన్నది కూడా పరిశీలిస్తారు. ఇక స్థానికంగా అధికంగా వాజ్యాలు ఉంటే వాటి కోసం నేరుగా అమరావతి రాకుండా బెంచ్ ని ఏర్పాటు చేస్తారు. ఈ రకమైన విషయంలో సీమలోని నాలుగు జిల్లాల నుంచి కేసులు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు దాంతో బెంచ్ ఏర్పాటుకు తగిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. మరో వైపు చూస్తే కర్నూల్ కి హై కోర్టు ఇవ్వడం ద్వారా రాజకీయంగా కూడా కూటమి ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందని అంటున్నారు. మరి పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో దీనికి సంబంధించిన కదలిక ఏమైనా ఉంటుందా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశంగానే ఉన్నాయని అంటున్నారు.