నారా లోకేష్ ట్వీట్ కు అలా స్పందించిన కర్ణాటక మంత్రి!

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ రాష్ట్రానికి పెద్ద ఎత్తున దేశీయ, అంతర్జాతీయ సంస్థలను పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-07-16 12:00 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ రాష్ట్రానికి పెద్ద ఎత్తున దేశీయ, అంతర్జాతీయ సంస్థలను పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆయా సంస్థలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి వివరిస్తున్నారు. ఈ సమయంలో తాజాగా ఏరో స్పేస్ పరిశ్రమను ఏపీకి ఆహ్వానిస్తూ మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ కు కర్ణాటక మంత్రి స్పందించారు.

అవును... కెంపెగౌడ అంతర్జాతీయ విమనాశ్రయానికి సమీపంలో ప్రతిపాదిత ఏరోస్పేస్ పార్క్ కోసం దేవనహళ్లీ తాలుకాలో 1777 ఎకరాల వ్యవసాయ భూములను సేకరించే ప్రతిపాదనను కర్నాటక ప్రభుత్వ విరమించుకుంటుందని.. సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. దీంతో.. ఇది నిరసన తెలుపుతున్న రైతులకు పెద్ద ఉపశమనంగా భావిస్తున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన సీఎం సిద్ధరామయ్య... తాము భూసేకరణ ప్రక్రియను నిలిపివేశామని.. అయితే, కొంతమంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని.. వారి నుంచి మాత్రమే ప్రభుత్వం భూములను సేకరిస్తుందని.. వారికి అధిక పరిహారంతోపాటు, డెవలపింగ్ చేసిన ప్లాట్ లను అందిస్తామని అన్నారు.

ఈ విషయంపై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేష్... ఈ విషయం తెలిసిన తర్వాత తనకు బాధగా ఉందని.. మీ కోసం తమ దగ్గర మంచి ఆలోచన ఉందని.. మీరు ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూడకూడదు? అంటూ ఏరో స్పేస్ ఇండస్ట్రీని ప్రశ్నించారు. మీ కోసం మా వద్ద ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీ ఉందని ఎక్స్ వేదికగా తెలిపారు.

ఇదే సమయంలో... అత్యుత్తమ ప్రోత్సాహకాలతో పాటు 8000 ఎకరాలకు పైగా భూమి సిద్ధంగా ఉందని చెబుతు... త్వరలో మిమ్మల్ని కలవాలని ఆశిస్తున్నట్లు ఏరో స్పేస్ ప్రతినిధులకు తెలిపారు! ఈ నేపథ్యంలోనే కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. ఈ సందర్భంగా సుదీర్ఘ పోస్టు పెట్టారు.

ఇందులో భాగంగా... కర్ణాటక భూమిని మాత్రమే అందించదని.. ఇది భారతదేశంలో నంబర్ 1 ఏరోస్పేస్ & డిఫెన్స్ ఎకోసిస్టమ్‌ ను అందిస్తుందని.. తామంతా దశాబ్దాలుగా దేశంలోనే బలమైన ఏరోస్పేస్ స్థావరాన్ని నిర్మించామని.. భారతదేశ ఏరోస్పేస్ ఉత్పత్తిలో 65% తోడ్పడి జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో నిలిచామని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

ఇది భూమి గురించి మాత్రమే కాదని.. ఇది ప్రతిభ, ఆవిష్కరణ, నిరూపితమైన ఎకోసిస్టమ్ గురించని తెలిపారు. ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో మాకు తెలుసని.. ఏమీ జారిపోదని అన్నారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను చేరుకున్న మొదటి రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి అవుతుందని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... ఇది ఏరోస్పేస్ మాత్రమే కాదు.. అనేక కొత్త పరిశ్రమలు కర్ణాటకను ఎంచుకుంటూనే ఉన్నాయని తెలిపారు. వృద్ధి, కొత్త పెట్టుబడులు రెండింటికీ మద్దతు ఇవ్వడానికి అవసరమైన భూమి మరియు ఎకోసిస్టమ్‌ ను తాము ఎల్లప్పుడూ నిర్ధారిస్తామని అన్నారు. ఈ సందర్భంగా... ఏపీకి కూడా బెస్ట్ విషెస్ చెప్పారు.

Tags:    

Similar News