12 లక్షల కోట్లు ఎక్కడ గంటా ?
లక్షల కోట్లు. చాలా పెద్ద నంబర్. అవును. ఇంత నంబర్ చెబితే చాలు కళ్ళు చెదిరిపోతుంది. గుండె గుభేల్ మంటుంది. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పదే పదే తలచుకోవడానికి బాగుంటుంది.;
లక్షల కోట్లు. చాలా పెద్ద నంబర్. అవును. ఇంత నంబర్ చెబితే చాలు కళ్ళు చెదిరిపోతుంది. గుండె గుభేల్ మంటుంది. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పదే పదే తలచుకోవడానికి బాగుంటుంది. అయితే బిగ్ నంబర్ వెనక ఉన్న విషయం కూడా చేరితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నంబర్లు ఎపుడూ గేమ్ ఆడతాయి. వాస్తవాలు అక్షరాలలోనే ఉంటాయి. అంకెలు పెట్టే తికమకలను అక్షరాలు సరిగ్గా సరిచేస్తాయి. ఏపీలో చూస్తే ఈ బిగ్ నంబర్ గేమ్ సాగుతోందా అన్న చర్చ అయితే మేధావుల నుంచి విశ్లేషకుల దాకా ఉంది మరి.
ఏ ప్రభుత్వం వచ్చినా :
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నారు మహా కవి శ్రీశ్రీ. అలాగే ఏ ప్రభుత్వం తీరు చూసినా ఏమున్నది గొప్పలు చెప్పుకోవడం తప్ప అని కూడా వర్తమాన రాజకీయ విశ్లేషకులు అనాల్సిన నేపథ్యం ఉంది. 2014 నుంచి 2019 మధ్యలో విభజన ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో కూడా లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేశాయి అని చాలా ఆర్భాటాలు చేశారు. ఎన్నో జాబ్స్ కూడా వచ్చేశాయని వంత పాడారు. కట్ చేస్తే ఎన్నికల ముందు రెండు వేల నిరుద్యోగ భృతితో మమ అనిపించేశారు. ఇక 2019 నుంచి 2024 మధ్యలో రాజ్యం చేసిన వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే తీరున లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని తెగ ఊదరగొట్టింది. తీరా చూస్తే కనుక పధకాల కోసం జనాలు ఎగబడడమే మిగిలింది. దీని భావమేంటి మహాశయా అంటే ఉద్యోగాలు అయితే హుళక్కే అన్నది అని మేధావులు ఉంటకిస్తున్నారు.
నంబర్ పెరుగుతోంది :
ఇక కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయింది. ఈ మధ్యలో అయిదారు లక్షల నుంచి పెట్టుబడుల రాక మొదలి ఇపుడు మాజీ మంత్రి భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నోట అది ఏకంగా పన్నెండు లక్షల కోట్ల దాకా ఎగబాకింది. నిజంగా అన్నేసి లక్షల కోట్లు వచ్చేశాయా అన్నది కూడా ఒక వైపు చర్చ సాగుతోంది. ఎందుకంటే ఏదైనా ఒకసారి చెబితే ఓకే పదే పదే చెబుతూంటే సీరియస్ గానే అంతా ఆలోచిస్తారు కదా.
పెట్టుబడి కంటే భూములే ఎక్కువ :
భూమి ఇపుడు అత్యంత ఖరీదైన వనరుగా ఉంది. ఎక్కడైనా భూములే పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. నానాటికీ జనాభా పెరుగుతోంది. పెరగనిది ఒక్క భూమి మాత్రమే. దాంతో భూముల విలువ నిన్నా నేడూ రేపూ చాలా మారిపోతున్నాయి. ఇక పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తూ వారికి భూములను ఉదారంగా ఇచ్చే గొప్పదనం ప్రభుత్వాలకు ఉండొచ్చు. అఫ్ కోర్స్ ఇదంతా ప్రజల కోసమే అని అనుకోవాలి. అయినా సరే వందల కోట్ల విలువ చేసే భూములు తీసుకుని సదరు పెట్టుబడిదారులు పెడుతున్న పెట్టుబడులు ఏమిటి ఎంత, వాటి వాల్యూ ఉదారంగా ఇచ్చిన భూముల కంటే కూడా తక్కువా ఎక్కువా అన్న చర్చ అయితే ఉంటూనే ఉంది.
శ్వేత పత్రం రిలీజ్ చేయాలి :
ఎన్ని పరిశ్రమలకు ఒప్పందం కుదిరింది. ఎన్ని పరిశ్రమలు స్థాపన దశలో ఉన్నాయి. ఎన్ని పూర్తి అయి ప్రారభమించుకే దశలో ఉన్నాయి, వాటి వల్ల ఎంతమందికి ఉపాధి దక్కింది. మరీ ముఖ్యంగా తమ భూములను త్యాగం చేసి ఇస్తున్న లోకల్ ఫ్యామిలీ బిడ్డలకు ఎంత లబ్ది చేకూరుంది. ఆ ప్రాంతానికి ఆ జిల్లాకు ఏ మేరకు ప్రగతి సాధ్యపడింది. ప్రభుత్వానికి ఈ పరిశ్రమల వల్ల వచ్చే ఆదాయం ఏమిటి ఇలాంటి విషయాలు జనాలకు తెలియాలి కదా అని అంటున్న్నారు. ఏ ప్రభుత్వం అయినా కస్టోడియన్ గానే ఉంటుంది. భూములకు అసలైన యజమానులు ఉన్నా టోటల్ గా ప్రజలే రాష్ట్రానికి యజమానులు. మరి తాము కేవలం అయిదేళ్ళకు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు భవిష్యత్తుకు మేలుగా ఉన్నాయా లేవా అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎపుడూ ఉంటుంది. అందుకే వైట్ పేపర్ విడుదల చేయడం పాలకుల బాధ్యత అంతే తప్ప నంబర్ బాగుంది కదా ఎవరికి తోచిన తీరున వారు మాట్లాడితే అది గందరగోళంలోకి నెట్టడం జరుగుతుంది.
ఖరీదైన భూములే ఎందుకు :
ఇక పోతే గతంలో పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే భూములు వ్యవసాయేతమైనవి నిరుపయోగంగా ఉన్నవి ఉండేవి. పైగా ఊరికి దూరంగా అభివృద్ధికి నోచుకోని చోట భూములు ఇచ్చేవారు. దాని వల్ల ఆయా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని వ్యవసాయానికి ఇబ్బంది ఉండదని భావించేవారు. కానీ ఇపుడు నగరం నడిబొడ్డున భూములు కావాలని పెట్టుబడిదారులు కోరుతున్నారు. వందల కోట్ల విలువైన భూములను వారికి కట్టబెడుతున్నారు. అంతే కాదు వ్యవసాయ భూములు కూడా ఇచ్చేస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. ఇక భూములు తీసుకున్న తరువాత వారు ఎంత పెట్టుబడి పెడుతున్నారో కూడా తెలియదని అంటున్నారు.
చీప్ గా భూములు దారాదత్తం :
అలాగే యువతకు ఎంత మేరకు ఉపాధి ఇస్తున్నారో కూడా తెలియదని అంటున్నారు. అందుకే నీటిలో గేదెను పెట్టి బేరమాడకుండా సరైన పద్ధతో రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకే భూములు ఇవ్వాలని కోరుతున్నారు. అత్యంత విలువైన భూములను ఇవ్వాలనుకుంటే వివాదాలే వస్తాయని అంటున్నారు. చీప్ గా భూములు దారాదత్తం చేస్తామనడం కూడా సబబు కాదని మేధావులు సూచిస్తున్నారు. ఎకరం 99 పైసలకే ఇస్తామని చెప్పడం ద్వారా మేలు ఎవరికి అన్నది కూడా ఆలోచించాలని అంటున్నారు.