బిగ్ బ్రేకింగ్.. పోలీసులకు షాక్, వైసీపీ నేతకు బెయిలు
జైలు నుంచి విడుదలైన తన భర్తను రెంటచింతల పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, ఆయన విడుదలకు ఆదేశించాలని తురకా కిశోర్ భార్య సురేఖ గత వారం కోర్టులో అత్యావసర పిటిషన్ దాఖలు చేశారు.;
ఏపీ పోలీసులకు రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. వైసీపీ నేత, మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిశోర్ రిమాండ్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితుడిని వెంటనే విడుదల చేయాలని రిమాండ్ రిపోర్టును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తురకా కిషోర్ పై దాదాపు 12 కేసులు నమోదయ్యాయి. వీటిలో వరుసగా అతడిని అరెస్టు చేస్తున్నారు పోలీసులు. ఇదే క్రమంలో ఇటీవల ఓ కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన అతడిని జైలు నుంచి విడుదలైన వెంటనే మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు. దీన్ని సవాల్ చేస్తూ తురకా కిశోర్ భార్య హైకోర్టులో పిటిషన్ వేయగా, నిందితుడి రిమాండ్ ను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది.
జైలు నుంచి విడుదలైన తన భర్తను రెంటచింతల పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, ఆయన విడుదలకు ఆదేశించాలని తురకా కిశోర్ భార్య సురేఖ గత వారం కోర్టులో అత్యావసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు వరుసగా విచారణ చేపట్టింది. ఈ రోజు జరిగిన విచారణలో నిందితుడు తురకా కిశోర్ అరెస్టును తప్పుబట్టిన హైకోర్టు, అరెస్టు సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించలేదని పోలీసులను తప్పుబట్టింది. చట్ట నిబంధనలను తుంగలోకి తొక్కారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
నిందితుడి భార్య సురేఖ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం నిందితుడిపై నమోదైన కేసు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. నిందితుడిని రిమాండ్ కు పంపుతూ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను మరోమారు పరిశీలించి, నిందితుడు బెయిలు పిటిషన్ దాఖలు చేయలేదన్న కారణంతో రిమాండ్ విధించడాన్ని తప్పుబట్టింది. బెయిలు కోసం దరఖాస్తు చేయకపోతే, మిగిలిన అంశాలను పరిశీలించాల్సిన అవసరం లేదా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
కాగా, రిమాండ్ రిపోర్టు తీసుకునేందుకు నిందితుడు అంగీకరించలేదని పోలీసులు చెబుతుండగా, మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో ఆ ప్రస్తావన చేయకపోవడంపై ధర్మాసనం ఆశ్యర్యం వ్యక్తం చేసింది. పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. నేరాంగీకార వాంగ్మూలంపై కిశోర్ సంతకం చేయలేదని అంటున్నారు? మీరు చెబుతున్నట్లు అతడు కరుడుగట్టిన నేరస్తుడే అనుకున్నా, అన్ని నేరాలు చేశానంటూ ఒప్పేసుకుంటాడా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక ఒక వ్యక్తి నిర్బంధం అక్రమమైనప్పుడు ఒక్క క్షణం కూడా జైల్లో ఉండటానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితుడు తురకా కిశోర్ తక్షణం విడుదలకు ఆదేశాలు జారీ చేసింది.