ఏడాదిలో బోలెడు సర్వేలు.. ఎందకింత క్రేజ్!?
అయితే.. ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా కొత్త ప్రభుత్వం.. ఏడాది కాలంలోనే అనేక సర్వేలను ఎదుర్కొం టోంది.;
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. అయితే.. సాధారణంగా ఏడాది కాలానికే ఏ ప్రభుత్వం కూడా.. తమ తమ పాలనా తీరును లెక్కలు వేసుకునేందుకు మొగ్గు చూపదు. దీనికి కారణం.. ఏడాది కాలంలో పెద్దగా మైనస్ ఉండదు. పైగా.. ప్రజలు కూడా కొత్త ప్రభుత్వంపై పెద్దగా ఆశలు పెట్టుకోరు. ఉన్న పరిస్థితిని చక్కబరుచుకునేందుకు అవకాశం కల్పిస్తారు. తమకు ఎన్నికలకుముందు ఇచ్చిన హామీలపైనా పెద్దగా ఏమీ ఆశించరు. దీంతో ఏడాది కాలం అంటే.. కొత్త ప్రభుత్వాలకు పెద్దగా లెక్కలోకి రాదు.
అయితే.. ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా కొత్త ప్రభుత్వం.. ఏడాది కాలంలోనే అనేక సర్వేలను ఎదుర్కొంటోంది. చిత్రం ఏంటంటే.. ఏడాది కాలంలో చేసిన సర్వేల్లో చాలా వరకు.. సర్కారు ప్రమేయంతోనే చేశా రని తెలిసింది. కేకే సర్వే వెనుక.. ప్రభుత్వమే ఉందని.. తెలిసింది. అలానే తాజాగా వచ్చిన మరో సర్వే కూడా సర్కారు స్వయంగా ఆదేశాలు ఇచ్చి.. చేయించిన సర్వేనేనని సమాచారం. దీనిలో ఇప్పుడు ఐఐటీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు కూడా పాలు పంచుకున్నారని తెలిసింది.
అంటే.. నేరుగా వారు ప్రజలను కలుసుకుని.. ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అంటే.. మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన సర్వేలను పరిశీలిస్తే.. నాలుగు సర్వేలు సాగాయి. ఫలితాలు ఎలా ఉన్నా యన్నది పక్కన పెడితే.. అసలు ఇంతగా సర్వేలు నిర్వహించేందుకు ఎందుకు మొగ్గు చూపుతున్నారన్న ది కీలక ప్రశ్న. సాధారణంగా ఎన్నికలకు ముందు సర్వేలు చేయించడం తప్పుకాదు. కానీ.. ఇంతగా ఎందుకు చేపట్టారన్నది ప్రశ్న. దీనికి ప్రధానంగా ఐదు అంశాలు ఉన్నాయని సమాచారం.
1) కూటమి ప్రభుత్వంపై ప్రజల నాడి పట్టుకోవడం.
2) జగన్ ఇమేజ్ ఎలా ఉంది?
3) ప్రభుత్వం ఇస్తున్న సూపర్ సిక్స్-గతంలో నవరత్నాలకు మధ్య పోలిక ఎలా ఉంది?
4) ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది. గతంలో వైసీపీ హయాంలో ఉన్నట్టుగానే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నారా? లేక మార్పు కనిపిస్తోందా?
5) అభివృద్ధిపై ప్రజలు ఏమనుకుంటున్నారు..
అనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా.. ప్రజలను కూటమి వైపు నుంచి బెసకకుండా చూసుకోవాలన్నది సర్కారు వ్యూహం. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారని.. చేస్తున్నవారిని ప్రోత్సహిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.