ఏఐతో ట్రాన్స్ ఫర్ ఆర్డర్.. ఇలా తయారయ్యారేంట్రా

అయితే ఆసుపత్రి వైద్యాధికారులకు ఆమె సమర్పించిన డాక్యుమెంట్‌పై అనుమానం కలిగింది.;

Update: 2026-04-30 19:30 GMT

ఆధునిక సాంకేతికత మానవాళికి వరంలా మారినప్పటికీ నేరగాళ్ల చేతిలో అది ప్రమాదకరమైన ఆయుధంగా మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో దానిని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ అధికారులనే బురిడీ కొట్టించే స్థాయికి కేటుగాళ్లు తెగబడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసిన ఒక ఘటన సాంకేతికత దుర్వినియోగంపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. చాట్ జీపీటీని ఉపయోగించి ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులనే సృష్టించిన వైనం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఘటన నేపథ్యం.. నమ్మకమే పెట్టుబడిగా..

శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన రమణమ్మ అనే మహిళ కడప జిల్లా గాలివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. దూర ప్రాంతంలో విధులు నిర్వర్తించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె, తన స్వగ్రామానికి దగ్గరగా బదిలీ చేయించుకోవాలని భావించారు. ఈ క్రమంలో ఆమె భర్త జయచంద్ర తన పరిచయస్తుడైన పలక వేణును సంప్రదించారు. తమకు ఉన్న ఇబ్బందులను వివరించి, బదిలీకి సహాయం చేయాలని కోరారు. దీనిని ఒక ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకున్న వేణు, తన కుమారుడు గంగాద్రితో కలిసి ఒక వ్యూహం పన్నారు. ఎటువంటి పైస్థాయి పరిచయాలు లేకపోయినప్పటికీ, సాంకేతికతను అడ్డుపెట్టుకుని తండ్రీకొడుకులు మోసానికి తెరలేపారు.

చాట్ జీపీటీతో 'డిజిటల్' మోసం

సాధారణంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఒక ప్రత్యేకమైన ఫార్మాట్‌లో అధికారిక భాషలో ఉంటాయి. వీటిని సృష్టించడం సామాన్యులకు అంత సులభం కాదు. కానీ వేణు, గంగాద్రి చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్‌ను ఆశ్రయించారు. ప్రభుత్వ బదిలీ ఉత్తర్వుల నమూనాను ఏఐ సాయంతో తయారు చేసి అందులో రమణమ్మ పేరు, ఉద్యోగ వివరాలు.. గాలివీడు నుంచి తనకల్లుకు బదిలీ చేస్తున్నట్లు పొందుపరిచారు. చూడటానికి అచ్చం ప్రభుత్వం విడుదల చేసిన జీవో లాగే ఉండేలా ఆ డాక్యుమెంట్‌ను రూపొందించారు. ఫాంట్లు, సీళ్లు, సంతకాలు సహా ప్రతి అంశాన్ని అత్యంత జాగ్రత్తగా పొందుపరిచి, ఆ నకిలీ ఉత్తర్వులను జయచంద్రకు అందజేశారు. వాటిని నిజమని నమ్మిన ఆ కుటుంబం, తమ కోరిక నెరవేరిందని సంతోషించింది.

గుట్టురట్టు అయిందిలా..

బదిలీ ఉత్తర్వులతో రమణమ్మ తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విధుల్లో చేరాలని ప్రయత్నించారు. అయితే ఆసుపత్రి వైద్యాధికారులకు ఆమె సమర్పించిన డాక్యుమెంట్‌పై అనుమానం కలిగింది. సాధారణంగా బదిలీ ఉత్తర్వులు వచ్చినప్పుడు, సంబంధిత ఆరోగ్య శాఖ నుండి ఆసుపత్రికి ముందే సమాచారం అందుతుంది. కానీ ఈ సందర్భంలో అలాంటి సమాచారం ఏదీ లేకపోవడంతో అధికారులు ఆ ఉత్తర్వులను క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు అవి నకిలీవని తేలడంతో అధికారులందరూ అవాక్కయ్యారు.

వెంటనే వైద్యాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లోతైన విచారణ జరపగా వేణు , గంగాద్రి చేసిన మోసం బయటపడింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తామే ఈ నకిలీ ఉత్తర్వులను సృష్టించినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

నిపుణుల హెచ్చరిక.. సాంకేతికతతో జాగ్రత్త!

ఈ ఘటన ప్రభుత్వ వ్యవస్థలకు.. సామాన్య ప్రజలకు ఒక కనువిప్పు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ ఉదంతంపై నిపుణులు.. పోలీసులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. బదిలీలు, ఉద్యోగాలు లేదా మరే ఇతర ప్రభుత్వ పనుల కోసం మధ్యవర్తులను ఆశ్రయించడం ముప్పును కొనితెచ్చుకోవడమే. ఏదైనా ఉత్తర్వు అందినప్పుడు ప్రభుత్వం నిర్వహించే అధికారిక వెబ్‌సైట్లలో (ఉదాహరణకు: AP GOIR) ఆ ఉత్తర్వు సంఖ్యతో సరిచూసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతటి అద్భుతాలను చేస్తుందో, అంతటి మోసాలకు కూడా వేదికవుతోంది. ఏఐ సృష్టించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మకూడదు. "చాట్ జీపీటీ వంటి టూల్స్ సమాచార సేకరణకు, సృజనాత్మకతకు పనికివస్తాయి కానీ, వాటిని చట్టవిరుద్ధ పనులకు వాడటం శిక్షార్హమైన నేరం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి," అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఏది ఏమైనా టెక్నాలజీని ఉపయోగించి ఒక నర్సింగ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగిని మోసం చేసిన ఈ ఘటన, డిజిటల్ నేరాల తీవ్రతకు అద్దం పడుతోంది. అధికారిక మార్గాల్లో వెళ్లకపోతే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News