టీచరమ్మగా మారిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పై తరగతి తీసుకున్న నిర్మలా సీతారామన్, మొక్కల లక్షణాలు, వాటి ఉపయోగాలు గురించి విద్యార్థులకు వివరించారు.;
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆకస్మికంగా ఒక స్కూల్ టీచర్‌గా మారారు. దేశ ఆర్థిక మంత్రి, ఈ సీనియర్ రాజకీయ నాయకురాలు, చిన్నారులతో కలిసిపోయి వారికి చక్కటి తెలుగులో పర్యావరణ పాఠాలు బోధించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గొరంట్ల మండలం, పాలసముద్రం సమీపంలో ఉన్న నాసిన్ (NASIN - National Academy of Customs, Indirect Taxes and Narcotics) ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు.
నాసిన్ క్యాంపస్‌లో మొక్కల పెంపకం
నాసిన్ క్యాంపస్‌లో మియావాకి పద్ధతిలో (Miyawaki method) మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, పాలసముద్రం హైస్కూల్ విద్యార్థులు కూడా పాలుపంచుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి కొరత కారణంగా ఎడారిగా మారకుండా నిరోధించడానికి మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకతను నిర్మలా సీతారామన్ వివరించారు.
విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పాఠాలు
విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పై తరగతి తీసుకున్న నిర్మలా సీతారామన్, మొక్కల లక్షణాలు, వాటి ఉపయోగాలు గురించి విద్యార్థులకు వివరించారు. దేశ ఆర్థిక మంత్రి స్వయంగా ఒక టీచర్‌గా మారి, విద్యార్థులకు పర్యావరణం గురించి బోధించడం అందరినీ ఆకట్టుకుంది. పర్ఫెక్ట్ తెలుగులో ఆమె చేసిన బోధన, చిన్నపిల్లలతో కలిసిపోయి మాట్లాడిన విధానం పట్ల ప్రజలు ప్రశంసలు కురిపించారు.
ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలలో, ముఖ్యంగా విద్యార్థులలో అవగాహన పెరుగుతుందని ఆశిస్తున్నారు. నీటి కొరత, పచ్చదనం లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న అనంతపురం వంటి జిల్లాలకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో అవసరం. కేంద్ర మంత్రి చొరవతో ఈ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచడానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.