మార్పు ఎవరిలో.. అధికారుల్లోనా... నేతల్లోనా..!
దీనికి కారణం స్థానికంగా ఉన్న రాజకీయాలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది జరిగిన పది రోజుల్లోనే సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సు పెట్టారు. కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. లక్ష్యాలు కూడా విధించారు.;
రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. పలు లక్ష్యాలు కూడా విధించారు. ముఖ్యంగా జిల్లాల అభివృద్ధి.. రాష్ట్ర అభివృద్ధి కూడా కలెక్టర్ల చేతుల్లోనే ఉందని ఆయన దిశా నిర్దేశం చేశారు. సహజంగా జిల్లా స్థాయి అధికారులకు ఈ తరహా ప్రోత్సాహం అవసరం. దిశా నిర్దేశం కూడా మంచిదే. అయితే వాస్తవానికి జిల్లాల అభివృద్ధి జరగాలన్నా.. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. కేవలం అధికారుల చేతిలోనే ఉంటుందా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
దీనికి కారణం జిల్లా స్థాయిలో అధికారులకు స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. ఇది వాస్తవం కూడా. ఒకప్పుడు జిల్లా స్థాయిలో కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ తాము చేయాలనుకున్న పనులను స్వేచ్ఛగా చేసేవారు. కనీసం ఎంతో కొంత మనసుపెట్టి పనిచేసే వాతావరణం ఉండేది. కానీ, రాను రాను ఇది తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలెక్టర్లు, ఎస్పీలకు ఎటువంటి స్వేచ్ఛ లేదన్నది వాస్తవం. ఇది ఎవరో చెప్పిన మాట కాదు.. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చేసిన వ్యాఖ్యలు. పల్నాడు జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా పరిస్థితిని మార్చేటటువంటి అవకాశం కలెక్టర్‌కు ఉన్నప్పటికీ మార్చలేని పరిస్థితి ఉందన్నారు.
దీనికి కారణం స్థానికంగా ఉన్న రాజకీయాలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది జరిగిన పది రోజుల్లోనే సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సు పెట్టారు. కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. లక్ష్యాలు కూడా విధించారు. కానీ, వాస్తవం మాత్రం వేరేగా ఉంది. ఈ విషయం చెప్పడానికి చాలామంది కలెక్టర్లు వెనుకంజ వేసినప్పటికీ.. కొందరు మాత్రం మీడియా ముందు స్పష్టం చేశారు. అధికారులపై నాయకుల పెత్తనం మరింత పెరిగిపోయింది అన్నది వారి ఆవేదన. ఎమ్మెల్యే స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు కూడా అనేకమంది కలెక్టర్లకు తాము చెప్పిందే చేయాలనేటటువంటి నిర్దేశం చేయడం సహజంగా మారింది.
దీంతో కలెక్టర్లు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక, ఎస్పీల విషయానికి వస్తే ఇటీవల కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎస్పీని బదిలీ చేశారు. దీనికి కారణాలు అందరికీ తెలిసిందే. స్థానికంగా ఉన్న కీలక నేత చెప్పినట్టు ఆయన వినిపించుకోలేకపోవడంతో ఆయనను బదిలీ చేశారని వైసీపీ నాయకులు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో టిడిపి నాయకులు కూడా అవునని తలులూపటం మరో విశేషం. అంటే తమ మాట వినకపోతే బదిలీలు, తమ మాట వినకపోతే ఆరోపణలు చేసి వారంతటివారే బదిలీ కోరుకునే లాగా చేస్తున్నారనేది కూడా ప్రధాన విమర్శ.
ఈ సమస్యలపై దృష్టి పెట్టకుండా కేవలం అధికారులపై బాధ్యతలు పెట్టి.. మీరు మారాలి, మీ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చంద్రబాబు చెప్పడం అనేది చోద్యం చూసినట్లే అవుతుంది తప్ప వాస్తవాలను పరిష్కరించినట్టుగా లేదన్నది కలెక్టర్ల వాదన. అంతేకాదు, వారి ఆవేదనను చంద్రబాబు తెలుసుకోవడంలో కూడా విఫలమవుతున్నారు. పైకి అంతా బాగుందని చెబుతున్నా.. అంతర్గతంగా నాయకుల ప్రభావాన్ని రాజకీయ ప్రభావాన్ని కలెక్టర్లు ఎస్పీలు తట్టుకోలేక సెలవులు పెట్టి వెళ్ళిపోతున్న సందర్భాలను కూడా అనంతపురం తిరుపతి వంటి జిల్లాల్లో గుర్తు చేస్తున్నారు. ఇకనైనా ఈ పరిస్థితి మారాలంటే సంస్కరణ జరగాల్సింది అధికార పార్టీ నాయకుల్లో తప్ప అధికారుల్లో కాదన్నది చంద్రబాబు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.