50 ఏళ్లలో 60 తుపానులు.. ఏటా కోస్తాకు కష్టాలు

సుదీర్ఘ సముద్రతీరం ఉన్న ఏపీలోని కోస్తా ప్రాంతం ఏటా తుపాన్ల ధాటికి నష్టపోతోంది. బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతల ప్రభావంతో ఏటా తుఫాన్లు సంభవిస్తున్నాయి.;

Update: 2025-10-27 10:20 GMT

సుదీర్ఘ సముద్రతీరం ఉన్న ఏపీలోని కోస్తా ప్రాంతం ఏటా తుపాన్ల ధాటికి నష్టపోతోంది. బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతల ప్రభావంతో ఏటా తుఫాన్లు సంభవిస్తున్నాయి. ఈ తుఫాన్లు ఏపీలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు మధ్య తీరం దాటుతున్నాయి. ఆ సమయంలో వీచే గాలులు, కురిసే వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బంగాళాఖాతంలో రెండు సీజన్లలో తుఫాన్లు ఏర్పడుతుంటాయి. కొన్ని మే నెలలో ఏర్పడితే, మరికొన్ని అక్టోబరు, నవంబరు నెలల్లో వస్తుంటాయి. ఈ రెండు సీజన్లలోనూ పంట నష్టం ఎక్కువగా ఉంటోంది. మే నెలలో వచ్చే తుపానుల వల్ల మామిడితోపాటు ఉద్యాన రైతులు నష్టపోతుండగా, అక్టోబరు, నవంబరు నెలల్లో వరి రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఏటా ఏపీని ఏదో ఒక తుపాను తాకుతోంది. దీంతో ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. 1971 నుంచి ఇప్పటివరకు దాదాపు 60 తుఫానులో ఏపీలో తీరం దాటాయి. ఇక పక్కనే ఉన్న ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో తీరం దాటే తుపానుల వల్ల కూడా ఏపీలోని కొన్ని ప్రాంతాలు నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతుండటం వల్ల తుఫాన్ల తీవ్రత నానాటికి పెరుగుతోంది. 2014లో వచ్చిన హుద్ హుద్ తుఫాన్ బంగాళాఖాతంలో వచ్చిన మిగిలిన అన్ని తుఫాన్ల కంటే పెద్దదిగా చెబుతున్నారు. ప్రభుత్వం వద్ద అందుబాటులో గణాంకాల ప్రకారం 1971లో శ్రీకాకుళం జిల్లా బారువ వద్ద ఒక తుఫాన్ తీరం దాటింది. అది ఉద్దానం ప్రాంతంలో బీభత్సం సృష్టించింది.

ఇక 1977లో దివిసీమ ఉప్పెన ఆ ప్రాంతంలో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తినష్టాన్ని కలిగించింది. రాష్ట్ర చరిత్రలో దివిసీమ ఉప్పెనను ఇప్పటికీ కథలు కథలుగా చెబుతుంటారు. అదేవిధంగా 1996లో చంద్రబాబు తొలిసారి సీఎం అయిన ఏడాదికి వచ్చిన తుఫాన్ కోనసీమను గడగడలాడించింది. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని బులుసుతిప్ప వద్ద తీరం దాటింది. ఆ సమయంలో కోనసీమ వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. 2000 నుంచి తుఫాన్లకు పేర్లు పెట్టడం ప్రారంభమవగా, 2000 నుంచి 2005 వరకు ఏపీని ఐదు తుపాన్లు తాకాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి.

ఇలా ఏపీ చరిత్రలో ఎన్నో తుఫాన్లు చూడగా, 2014లో విశాఖను అతలాకుతలం చేసిన అతిపెద్ద భీకర తుఫాన్ హుద్ హుద్. ఈ తుఫాన్ ఏర్పడిన సమయంలోనూ చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఆ తుఫాన్ ధాటికి ఏకంగా రూ.21,908 కోట్ల నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో అత్యధిక నష్టం వాటిల్లిన తుఫాను హుదు హుద్ గానే ఇప్పటికీ చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఏర్పడిన మొంథా తుఫాన్ కూడా హుద్ హుద్ స్థాయిలోనే ప్రభావం చూపుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తుఫాను కారణంగా వంద నుంచి 120 కి.మీ. స్పీడుతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల కొబ్బరి, అరటి తోటలతోపాటు విద్యుత్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని భయపడుతున్నారు.

Tags:    

Similar News