వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలో బిగ్ ట్విస్ట్...ఆమె షాక్

వైసీపీ ఎమ్మెల్సీలు ఆరుగురు గత ఏడాదిన్నర కాలంలో వివిధ సందర్భాలలో తమ పదవులకు రాజీనామా చేశారు.;

Update: 2025-12-01 17:36 GMT

వైసీపీ ఎమ్మెల్సీలు ఆరుగురు గత ఏడాదిన్నర కాలంలో వివిధ సందర్భాలలో తమ పదవులకు రాజీనామా చేశారు. చిత్రమేంటి అంటే వీరు రాజీనామా చేసినా కూడా ఇంకా వైసీపీ ఎమ్మెల్సీలుగా శాసనమండలి రికార్డులలో ఉన్నారు. దానికి కారణం మండలి చైర్మన్ వారి రాజీనామాలను ఆమోదించలేదు. అదే సమయలో వీరంతా కూటమిలోని వివిధ పార్టీలలో చేరిపోయారు. ఆయా పార్టీలలో కూడా వీరు కనిపిస్తున్నారు. కానీ వీరు సమర్పించిన రాజీనామాల విషయంలో ఏ నిర్ణయం ఇప్పటిదాకా వెలువడలేదు, మరో వైపు చూస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళ వెంకట రమణ ఈ విషయం మీద కోర్టుని ఆశ్రయించడంతో కోర్టు నాలుగు వారాలలోగా ఈ రాజీనామాల విషయలో నిర్ణయం తీసుకోవాలని కోరింది.

మండలి చైర్మన్ తో భేటీ :

ఈ నేపధ్యంలో మండలి చైర్మన్ కొయ్యే మోషెన్ రాజుని రాజీనామాలు చేసిన ఆరుగురు ఎమ్మెల్సీలు సోమవారం కలిశారు. వారు తమ రాజీనామాలను ఆమోదించాలని ఆయనను కోరారు. ఈ సందర్భంగా వారు మనస్పూర్తిగా రాజీనామాలు చేస్తున్నారా అన్న దాని మీద చైర్మన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక చైర్మన్ ని కలిసిన వారిలో కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి జయమంగళ వెంకటరమణ, జకీయా ఖాన్ తదితరులు ఉన్నారు.

ఆమె యూ టర్న్ :

అయితే ఈ సందర్భంగా జకియా ఖాన్ యూ టర్న్ తీసుకున్నారు అని అంటున్నారు. ఆమె తన రాజీనామాను ఉప సం హరించుకున్నట్లుగా చైర్మన్ కి ఒక లేఖ అందచేసినట్లుగా చెబుతున్నారు. ఆమెను చైర్మన్ రాజీనామాకు గల కారణాలను ఆరా తీశారు. ఆ మీదట ఆమె తాను పదవికి రాజీనామా చేయడం లేదని చెప్పినట్లు తెలిసింది. ఆ మేరకు లేఖ కూడా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దాంతో ఆమె రాజీనామా చేసిన మొదటి లేఖను చైర్మన్ ఆమోదిస్తారా లేక తాజాగా ఇచ్చిన లేఖను పరిగణనలోకి తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది.

బీజేపీలో చేరి :

అయితే జకియా ఖాన్ బీజేపీలో చేరిపోయారు. ఆమె కొన్నాళ్ళ క్రితం వైసీపీని వీడారు. అయితే బీజేపీ నుంచి ఆమె ఎందుకు బయటకు వస్తున్నారు, మళ్ళీ వైసీపీలో ఉంటారా లేక తన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారా ఏమిటి అన్నది ఒక చర్చకు తావిస్తోంది. దీని మీద రాజకీయ వర్గాలలోనూ పలు ఊహాగానాలు అయితే రేగుతున్నాయి. ఇంకో వైపు చూస్తే ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. కానీ వీరిలో కొందరు ఏ పార్టీలో చేరాలని చూసినా అవకాశాలు రాకుండా ఉన్నారు. మరి కొందరు చేరినా అక్కడ తమకు సరైన గుర్తింపు లేదని భావిస్తున్నారుట. దాంతో చైర్మన్ వారిని స్వయంగా పిలిచి విచారించినపుడు జకియా ఖాన్ అయితే తన రాజీనామా వెనక్కి తీసుకున్నారు. మిగిలిన వారు ఏమి చేస్తారు అన్నది చూడాలి. మొత్తం మీద ఈసారి అయినా చైర్మన్ వీరి రాజీనామాలను ఆమోదిస్తారా లేదా అన్నది సరికొత్త చర్చగా ఉంది.

Tags:    

Similar News