మనోళ్లే అయినా.. చంద్రబాబుకు ఇబ్బందే ..!
అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కీలక ప్రతిపాదన అటు ముఖ్యమంత్రికి, ఇటు కాంట్రాక్టర్లకు కూడా తీవ్ర సంకటంగా మారింది.;
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కాంట్రాక్ట్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద సమస్య ఎదురయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో రహదారులు, తాగునీటి, సాగునీరు ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు టిడిపికి అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లను ఎంపిక చేసి, వారికి ఇస్తున్నారనేది పెద్ద చర్చ. సరే ఏదైతే ఏమైంది.. ప్రజలకు పనులు కావడం ముఖ్యం. ప్రభుత్వానికి తొందరగా పనులు చేయటం ముఖ్యం. అనే ఈ కాన్సెప్ట్ ని ఎంచుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తున్నారు.
అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కీలక ప్రతిపాదన అటు ముఖ్యమంత్రికి, ఇటు కాంట్రాక్టర్లకు కూడా తీవ్ర సంకటంగా మారింది. ఉదాహరణకు ప్రస్తుతం ఉన్న నిబంధనలు, నియమాలను పరిశీలిస్తే ఏదైనా ఒక రహదారిని కాంట్రాక్టర్ నిర్మిస్తే దానిని మూడు సంవత్సరాల పాటు మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఆ మూడు సంవత్సరాల్లో ఏదైనా లోపాలున్న, ఆ రహదారి పాడైన, ఆ కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. ఈ మూడేళ్ల కాలంలోనే ప్రభుత్వం అతనికి చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని చెల్లించేస్తుంది.
అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి కొత్త నిబంధన ప్రకారం.. 10 సంవత్సరాల పాటు కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. అది చిన్న రహదారి అయినా పెద్ద ప్రాజెక్టు అయినా సాగునీటి ప్రాజెక్టు అయినా తాగునీటి ప్రాజెక్టు అయినా కూడా సదరు కాంట్రాక్టర్ 10 సంవత్సరాలు పాటు ఆ ప్రాజెక్టుకు బాధ్యత వహించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తొలి ఐదు సంవత్సరాలు పాటు విడతల వారీగా ఇస్తారు. కాంట్రాక్టర్ ఖర్చు చేసే సొమ్మును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నిధులు మాత్రం పది సంవత్సరాలు పాటు కొనసాగిస్తారు.
ఇది సమస్యగా మారింది. సాధారణంగా అంత సుదీర్ఘకాలం పాటు కాంట్రాక్టర్లు వేచి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు కూడా అప్పులు తీసుకొచ్చి పనులు చేయిస్తారు. అలాగే కూలీలకు, సామాగ్రికి, యంత్రాలకు ఖర్చు పెడతారు. కాబట్టి అంత సుదీర్ఘకాలం పాటు ఎదురు చూసే పరిస్థితి వారికి కనిపించడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు పదివేల కోట్ల రూపాయలకు పైగా చేపట్టాల్సిన పనులు ఆగిపోయాయి. ఇదే విషయాన్ని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు.
'మన వాళ్లు కూడా రావడం లేదా' అని మంత్రుల వద్ద ఆయన ప్రశ్నించారు. దీనికి మంత్రులు కూడా రావడం లేదనే సమాధానం చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు వేచి ఉండడం, వారు ఖర్చు చేసిన సొమ్మును 10 సంవత్సరాల పాటు నిలిపివేయడం వంటివి ప్రధాన సమస్యగా మారాయిని, దీంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఇది కేంద్రం పెట్టిన నిబంధన అని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అయితే దీనివల్ల స్థానికంగా పనులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడడం.. మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి రావడం వంటివి ఇబ్బందికరంగా మరనున్నాయి. దీనికి మధ్య మార్గంగా ఏం చేయాలనే దానిపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.