షర్మిళ సాహసం... ఉగ్రదాడి నేపథ్యంలో మోడీపై నిప్పులు!
అవును... పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందిస్తూ... ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.;
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి విషయంలో దేశమంతా పాకిస్థాన్ పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆ రకంగానే వ్యాఖ్యానిస్తూ అంతా కలిసి ఉండాలని కోరారు! ఈ సమయంలో తాజా ఉగ్రదాడికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన కారణం అంటూ షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందిస్తూ... ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా... ప్రధాని మోడీని ఈ దేశ ఇంటర్నల్ టెర్రరిస్ట్ గా అభివర్ణించారు! తాజా దాడికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
తాజాగా పహల్గాంలో జరిగిన ఘటన పూర్తిగా భారతదేశ నిఘా వ్యవస్థ లోపంగా చెప్పిన షర్మిల... దానికి కారణం భారత్ నిఘా వ్యవస్థలను మోడీ వ్యవస్థలుగా మార్చారని.. వాటిని భారత రక్షణ కోసం కాకుండా.. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి కోసం, వాళ్ల గొంతులు కొన్నేందుకు వాడుతున్నారని షర్మిళ తీవ్ర ఆరోపణలు చేశారు.
బీజేపీ పాలనలో భారత్ లో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని మోడీ పెద్ద క్యాంపెయిన్ నడిపారని.. పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టించారని.. ఇది చూసి ఏటా సుమారు రెండు కోట్ల మంది కాశ్మీర్ కి పర్యటనకు వస్తున్నారని.. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకుందని ప్రశ్నించిన షర్మిల... అక్కడ ఒక్క జవాన్ కూడా లేరని అన్నారు.
అటువంటి ప్రాంతంలో ప్రొటెక్షన్ కోసం ఉండే రెగ్యులర్ సెక్యూరిటీ కూడా లేదని చెప్పిన షర్మిల.. ఇంతమంది మరణానికి ప్రభుత్వ లోపమే కారణమని అన్నారు. నిత్యం మోడీ చౌకీదార్ అని చెప్పుకుంటారని.. వాస్తవానికి ఆయన బీజేపీకి చౌకీదార్ అని.. దేశానికి కాదని.. ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని షర్మిల ఫైర్ అయ్యారు!
వాస్తవానికి దేశంలో పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ.. ఆ వ్యవస్థ దేశం కోసం పని చేయడం లేదని.. వారంతా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిపై పడుతున్నారని షర్మిల విమర్శించారు. ఇంత ఘోరంగా సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విఫలమైనప్పుడు వీళ్లకు అధికారంలో ఉండే హక్కు ఏమాత్రం లేదని.. దేశ భద్రతను గాలికొదిలేశారని ఆమె ఆరోపించారు.
ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారని చెప్పిన షర్మిల... దేశంలోని ముస్లింలను చెడ్డవాళ్లు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఓ పక్క మణిపూర్ లో క్రైస్తవులను చంపుతున్నారని.. వక్ఫ్ బిల్లుతో ముస్లింలను ఇబ్బంది పెడుతున్నారని.. దేశంలో మతం పేరుతో యుద్ధం లేపుతున్నారని.. ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీనే అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు!