షర్మిల-పురందేశ్వరి.. మహిళా నేతల గ్రాఫేంటి ..!
రాష్ట్రంలో ఉన్న రెండు జాతీయ పార్టీలకు.. ఇద్దరు మహిళలు ప్రాతినిధ్యం వహించడం.. నిజంగా ఎవరి కైనా గర్వకారణమే.;
రాష్ట్రంలో ఉన్న రెండు జాతీయ పార్టీలకు.. ఇద్దరు మహిళలు ప్రాతినిధ్యం వహించడం.. నిజంగా ఎవరి కైనా గర్వకారణమే. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు ఉన్నాయి. వీటికి పురుష నాయకులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ, అదేసమయంలో కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలకు మాత్రం ఇద్దరూ మహిళలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా వైఎస్ షర్మిల, బీజేపీ చీఫ్‌గా పురందేశ్వరి.. ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఎన్నికలకు కొన్నాళ్లకు ముందే ఈ ఇద్దరు ఆయా పార్టీల బాధ్యతలు తీసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ విషయానికి వస్తే.. రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో ఆ పార్టీ ఇరుకున పడింది. జీరో అయింది. దీంతో తిరిగి పునరుత్థానం కల్పించాలన్న లక్ష్యంతో అనేక ప్రయోగాల అనంతరం.. షర్మిలకు అవకాశం ఇచ్చారు. అయితే.. ఆమె గత ఎన్నికల్లో 0.5 శాతం ఓటు బ్యాంకును పుంజుకునేలా చేయడానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇక, ఓటు బ్యాంకు కన్నా ముందు.. నాయకుల మధ్య సఖ్యత ముఖ్యం.
ఈ దిశగా కూడా.. షర్మిల గత ఏడాది కాలంలో బలమైన నాయకురాలిగా అయితే ముద్ర వేసుకోలేక పోయా రనే వాదన ఉంది. ముఖ్యంగా సీనియర్లను అక్కున చేర్చుకుని.. వారితో చర్చించే సంప్రదాయాన్ని షర్మి ల పూర్తిగా పక్కన పెట్టారు. ఫలితంగారాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి గతానికి భిన్నంగా అయితే ఏమీ లేదు. మరి ఈ ఏడాది అయినా.. ఆమె సొంత అజెండా స్థానంలో ప్రజా అజెండాను ఎంపిక చేసుకుని ముందుకు సాగుతారో లేదో చూడాలి. కానీ.. సీనియర్లు మాత్రం ప్రజా అజెండానే కోరుకుంటున్నారు.
ఇక, బీజేపీ చీఫ్ పురందేశ్వరి విషయానికి వస్తే.. ఆమెకు రాజకీయాలు కొత్తకాదు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక, బీజేపీ వంటి బహుముఖ లక్షణాలు ఉన్న నాయకులు ఉన్నారు. పైగా ఆర్ ఎస్ ఎస్ నాయకులు కూడా ఉన్నారు. అయితే.. పురందేశ్వరి తనదైన శైలిలో ఎంత వరకు స్పందించాలో.. ఎంత వరకు ఏయే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో.. తనకంటూ హద్దులు గీసుకుని.. వ్యవహరిస్తున్నారు. అదేసమయంలో కేంద్రంలోని పెద్దలతోనూ కలివిడిగా ఉంటున్నారు. దీంతో పార్టీపరంగా ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం బీజేపీ పురందేశ్వరి గ్రాఫ్ పదిలంగానే ఉందని చెప్పాలి.