బీజేపీ తీరు పట్ల కూటమిలో అసహనం ?

కూటమిలో టీడీపీ జనసేన ఉన్నంత సాన్నిహిత్యంతో బీజేపీ ఉండడం లేదని ప్రచారం అయితే ఉంది. దానికి కారణం బీజేపీ జాతీయంగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం.

Update: 2026-05-26 01:19 GMT

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. ఇందులో పెద్దన్న ఎవరూ అంటే డౌటే లేకుండా టీడీపీ అని చెబుతారు. అదే విధంగా ప్రభుత్వానికి కూడా ఆ పార్టీ నాయకత్వం వహిస్తోంది. 135 మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి ఉన్నారు. ఇక రెండో స్థానంలో జనసేన ఉంది. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడవ ప్లేస్ ముచ్చటగా బీజేపీదే. ఎందుకంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీకి ఉన్నారు. కూటమిలో పదవుల విషయంలో చూసినా ఇదే రేషియో ప్రకారంగానే పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఇక కూటమిలో టీడీపీ జనసేన చాలా సన్నిహితంగా ఉన్నట్లుగా బాహాటంగానే కనిపిస్తూంటాయి. రెండూ ప్రాంతీయ పార్టీలు ఇద్దరు అధ్యక్షులూ కూడా తరచూ కలుస్తూ భేటీలు వేస్తూ అనేక అంశాలు చర్చిస్తూ ఉంటారు. బీజేపీ అయితే జాతీయ పార్టీ. ఏపీలో ఆ పార్టీ నాయకత్వం అంతా కేంద్రంలోని పెద్దల డైరెక్షన్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇదే మిగిలిన రెండు పార్టీలకూ బీజేపీకి మధ్య తేడా అని అంటారు.

అంటీ ముట్టనట్టుగా :

కూటమిలో టీడీపీ జనసేన ఉన్నంత సాన్నిహిత్యంతో బీజేపీ ఉండడం లేదని ప్రచారం అయితే ఉంది. దానికి కారణం బీజేపీ జాతీయంగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. మరో వైపు చూస్తే కీలక అంశాలలో టీడీపీ జనసేన ఒక్కటిగా ముందుకు పోతూంటే ఏపీ బీజేపీ నుంచి తగిన సహకారం లభించడం లేదు అన్న బాధ కూడా ఉందని అంటారు. గతంలో శ్రీవారి లడ్డూలలో కల్తీ జరిగింది అన్న విమర్శలు కూటమిలో టీడీపీ జనసేన చేసినపుడు బీజేపీ అయితే అంతగా రియాక్ట్ కాలేదని గుర్తు చేస్తున్నారు. నిజానికి హిందూత్వకు పేటెంట్ హక్కులు అన్నీ బీజేపీకే ఉన్నాయి. కానీ ఎందుకో ఆశించిన స్థాయిలో ఆ పార్టీ అయితే ఈ ఇష్యూని టేకప్ చేయలేదని అంటున్నారు. దాంతో కూటమిలో అప్పటికే ఒక రకమైన అసంతృప్తి ఉందని చెబుతారు. ఆ తరువాత కూడా అనేక అంశాలలో మరీ ముఖ్యంగా వైసీపీని విమర్శించడంలో టీడీపీ జనసేన ముందుంటే బీజేపీ మాత్రం ఆచీ తూచీ వ్యవహరిస్తుంది అని అంటున్నారు. అది కూడా కూటమిలోని రెండు పార్టీలకు కొంత ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు.

పవన్ ఘాటు వ్యాఖ్యలు :

లేటెస్ట్ గా రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి వల్లభాయ్ పటేల్ తరువాత అంతటి బలమైన నాయకుడు టఫెస్ట్ హోం మంత్రి అని అమిత్ షా అని పేర్కొన్నారు. కాశ్మీర్ ఇష్యూని ఆయన సెటిల్ చేశారు అని పశ్చిమ బెంగాల్ లోనూ లా అండ్ ఆర్డర్ విషయంలో గట్టిగా వ్యవహరించారని కొనియాడారు. అలాంటి అమిత్ షా విషయంలో ఒక విశ్లేషకుడు ఊహించి ఏవేవో మాట్లాడితే కనీసంగా ఖండించకపోవడమేంటని ఏపీ బీజేపీ నేతల తీరుని ప్రశ్నించారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు అని పవన్ అంటూ కేవలం ఇద్దరు నేతలు మాత్రమే రియాక్ట్ అయ్యారని చెప్పారు. వారి కంటే కూడా జనసేన నాయకులే బాగా స్పందించారు అని అంటూ అమిత్ షాని అంటే మీకేమీ అనిపించలేదా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.

అన్ని విషయాల్లో భాగస్వామ్యం :

పవన్ ఎపుడూ ఇంత బాహాటంగా ఏపీ బీజేపీ నేతల తీరుని తప్పు పట్టలేదు, గతంలో ఆయన విపక్షంలో ఉన్నపుడు కూడా బీజేపీ జాతీయ నాయకత్వంతోనే ఎక్కువగా టచ్ లో ఉండేవారు అన్నది చెబుతారు. అయితే కూటమి కట్టి ప్రభుత్వం నడుపుతున్నాక అన్ని విషయాల్లోనూ బీజేపీ భాగస్వామ్యం కూడా ఉండాలి కదా అన్న చర్చ ఉంది. కనీసం తమ నాయకుడిని అన్నా కూడా బీజేపీ నేతలకు పట్టదా అని సూటిగానే పవన్ ప్రశ్నించడం ద్వారా కూటమి పార్టీలకు బీజేపీ మీద ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు అని అంటున్నారు. నిజానికి టీడీపీకి కూడా అనేక అంశాలలో బీజేపీ మీద అసంతృప్తి ఉందని అంటారు.

బీజేపీలో కూడా అసంతృప్తి :

అయితే బీజేపీకి కూడా కూటమి పార్టీలలో తమకు ఇస్తున్న ప్రాధాన్యత పట్ల అసంతృప్తిగా ఉందని అంటున్నారు. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారని తమకు రెండు మంత్రి పదవులు కూడా ఇవ్వలేదని బీజేపీ నేతల భావనగా ఉందని అంటారు. అలాగే నామినేటెడ్ పదవుల విషయంలోనూ అన్యాయం జరుగుతోందని పార్టీలో చర్చ ఉంది. ఇంకో వైపు చూస్తే బీజేపీ జాతీయ పార్టీ అని అందువల్ల తమ విధానాలు అన్నీ ఆ కోణంలో ఉంటాయని అన్ని విషయాల మీద ప్రాంతీయ పార్టీల మాదిరిగా స్పందించడానికి కుదరదు అన్నది కూడా కమలనాధులు చెబుతారు. అవన్నీ పక్కన పెట్టినా అమిత్ షా విషయంలో పవన్ చెప్పినట్లుగా బీజేపీ నేతల స్పందన ఎందుకు లేదు అన్నది సూటి ప్రశ్నగానే ఉంది.

Tags:    

Similar News