ఫ్రీ బస్సు ఆటోకీ లింక్...వర్కౌట్ అవుతుందా ?

ఏపీలో కూటమి ప్రభుత్వం తనది కాని బాటలో వెళ్తోంది. ఒకరి చెప్పులో కాలు పెట్టడం అంటే ఇదే అంటారు. ఉచితాలకు చంద్రబాబు వ్యతిరేకం అన్నది మొదటి నుంచి ఉంది.;

Update: 2025-10-04 03:33 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం తనది కాని బాటలో వెళ్తోంది. ఒకరి చెప్పులో కాలు పెట్టడం అంటే ఇదే అంటారు. ఉచితాలకు చంద్రబాబు వ్యతిరేకం అన్నది మొదటి నుంచి ఉంది. ఆయన సంస్కరణవాది. చేపను పట్టడం నేర్పిస్తారు, తప్ప పట్టి చేతికి ఇవ్వరు. ఆయన 1995 నుంచి 2004 మధ్యలో ఉమ్మడి ఏపీలో చేసిన పాలన అలాగే ఉంటుంది. ఫలితంగానే బాబుకు మంచి పాలకుడు అన్న ఇమేజ్ వచ్చింది. అఫ్ కోర్స్ ఆయన ఎన్నికల్లో ఓటమికి కూడా కారణం ఆయన విధానాలు అని అంటారు. అయితే 2009 నుంచి బాబు ఆల్ ఫ్రీ బాబు అయిపోయారు. ఇక విభజన ఏపీలో ఆయన కొంత మేరకు ఉచితాలు ఇచ్చారు. అప్పటికీ ఆయనలో సంస్కరణవాది అలాగే బలంగా ఉన్నారు. కానీ 2024లో మాత్రం పూర్తిగా ఉచితాలకు జై కొట్టేశారు.

ఎన్నడూ లేని విధంగా :

ఇక బాబు సూపర్ సిక్స్ హామీలతో ఏపీవ్యాప్తంగా ప్రచారం చేశారు. దాని ఫలితమో లేక జగన్ ప్రభుత్వం మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణమో కానీ ఎన్నడూ లేని విధంగా కూటమికి బ్రహ్మాండమైన మెజారిటీ దక్కింది. ఇక 2014 నాటి బాబు అయితే హామీలను ఏ 2028లోనో అమలు చేసేవారు. కానీ ఇపుడు బాబు మారిపోయారు కాబట్టి 2025లోనే అమలుకు సిద్ధ పడిపోయారు. దాంతో సూపర్ సిక్స్ లో ఒకటి రెండు తప్పించి చాలా జనాలకు చేరాయి.

ఫ్రీ బస్సుతో రెడీ :

ఇక చంద్రబాబు ఆగస్ట్ 15న ఉచిత బస్సు పధకాన్ని ఏపీలో ప్రారంభించారు. దీని వల్ల మహిళలకు ఫ్రీగా బస్సెక్కే చాన్స్ దక్కింది. దీని ఫలితంగా ఆటో కార్మికులకు ఉపాధి పోయింది. వారి ఆటోల వైపు ఎవరూ తొంగి చూడడం లేదు. దాంతో వారు రోడ్డెక్కారు. అంతే కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల కోసం ఏటా 15 వేల రూపాయలు అటూ పధకాన్ని ప్రకటించింది. దానిని శనివారం ఘనంగా ప్రారంభిస్తున్నారు.

భారీగానే ఖర్చు :

ఈ పధకానికి ఏటా అయ్యే ఖర్చు 435 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. అదే విధంగా ఈ పధకం ద్వారా 2 లక్షల 90 వేల మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. ప్రతీ అకౌంట్ లో 15 వేల రూపాయలు ఈ పధకం కింద వేస్తారు అది ఆయా ఆటో కార్మికుల అకౌంట్లో డబ్బులుగా జమ చేయనున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకంగా దీనిని కూటమి ప్రభుత్వం ముందుకు తెచ్చింది. గతంలో ఆటో కార్మికులకు వైసీపీ ప్రభుత్వం పది వేల రూపాయలను ఏటా ఇచ్చేది. దానినే పేరు మార్చి పదిహేను వేలు ఇస్తున్నారు.

హ్యాపీయేనా :

ఇక ఈ పధకం వల్ల ఆటో కార్మికులు హ్యాపీయేనా అంటే జవాబు మాత్రం చెప్పడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఏడాదికి 15 వేలు అంటే నెలకు 1250 రూపాయలుగా ఉంటుంది. అంటే రోజుకు 40 రూపాయలు అని లెక్క వేస్తున్నారు. ఇది తమకు ఏ విధంగా సాయం అవుతుందని ఆటో కార్మికులలో చర్చ అయితే ఉంది. గతంలో జగన్ పది వేలు ఇచ్చినా తమకు మహిళా ప్రయాణీకులు అతి పెద్ద కస్టమర్లుగా ఉండేవారు అని ఆ ఆదాయనికి అదనంగా ప్రభుత్వం ఇచ్చేదని గుర్తు చేస్తున్నారు. ఇపుడు ప్రధాన ఆదాయం తగ్గి ఇబ్బందుల్లో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంతో కొంత ఊరటగా మరి కొందరు చెబుతున్నారు.

ఉచిత బస్సు ఓట్లు తెస్తుందా :

మరో వైపు ఉచిత బస్సుతో ఆర్టీసీ కుదేలు అవుతోంది అని అంటున్నారు. నెలకే రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల దాకా ఆర్టీసీకి నష్టం వస్తోంది అని అంటున్నారు. ఇక ఉచిత బస్సు వల్ల ఓట్లు వస్తాయా అంటే గ్యారంటీ లేదని అంటున్నారు. తెలంగాణా కర్ణాటక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పధకం అమలు చేసినా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ తినారని అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదని గుర్తు చేస్తున్నారు. ఉచితాల వల్ల ఓట్లు రాలేది పెద్దగా ఉండదని ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు లాంటి వారు చెబుతున్న నేపధ్యం ఉంది అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ లాంటి ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో ఉచితాల పేరుతో పధకాలు దానిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మరిన్ని తాయిలాలు ఇస్తూ పోతూంటే ఏపీ అనుత్పాదక ఖర్చులే అధికం అయిపోతాయని అంటున్నారు.

Tags:    

Similar News