శ్రీచరణికి కానుకలే కాదు.. అరుదైన గౌరవం కూడా!
భారత మహిళా క్రికెటర్, ఏపీలోని కడప జిల్లాకు చెందిన శ్రీచరణికి.. రాష్ట్రం తరఫున సీఎం చంద్రబాబు.. పలు కానుకలు ప్రకటించిన విషయం తెలిసిందే.;
భారత మహిళా క్రికెటర్, ఏపీలోని కడప జిల్లాకు చెందిన శ్రీచరణికి.. రాష్ట్రం తరఫున సీఎం చంద్రబాబు.. పలు కానుకలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ప్రపంచకప్ పోటీలో ఘన విజయం దక్కించుకున్న తర్వాత మహిళా క్రికెట్ టీం సభ్యులు ఎవరి రాష్ట్రాలకు వారు చేరుకున్నారు. ఈ క్రమం లో శుక్రవారం ఏపీకి వచ్చిన శ్రీచరణితో సీఎం చంద్రబాబు సుమారు గంటకుపైగా భేటీ అయ్యారు. ఆమె ఫ్యూచర్ ప్రణాళికలు తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే శ్రీచరణికి 2.5 కోట్ల రూపాయల నగదు, 1000 చదరపు గజాల ఇంటి స్థలం (కడపలో).. గ్రూప్ -1 ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అయితే.. ప్రభుత్వం అక్కడితో ఆగిపోలేదు. ప్రపంచ కప్ సాధించిన జట్టులో ఏపీ క్రీడాకారిణి ఉండడం తొలిసారి కావడంతో ఆమెకు గుర్తుకు అరుదైన కానుక ఉండాలని భావించింది. ఈ క్రమంలోనే ఏపీ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
విశాఖపట్నంలోని భారీ క్రికెట్ స్టేడియంలో ఒక పార్ట్‌కు `శ్రీచరణి` పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కీలక ప్రకటన చేసింది. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యురా లైన ఏపీకి చెందిన మహిళా క్రికెటర్ శ్రీ చరణికి ఇది అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపింది. అదేసమయంలో కడపలోనూ భారీ క్రికెట్ స్టేడియం నిర్మించే ప్రతిపాదనను పరిశీలిస్తామని.. ఒకవేళ అది సాకారమైతే.. దానికి కూడా శ్రీచరణి పేరు పెట్టనున్నట్టు పేర్కొంది.