నరకాసుర సంహారం గుర్తుంచుకోండి: చంద్రబాబు సందేశం
ఈ రెండు పండుగలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలని.. ప్రస్తుతం రహదారులు బాగున్నాయని.. ఒకప్పుడు గుంతలు పడిన రోడ్లపై ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పిన చంద్రబాబు మళ్లీ గుంతల రోడ్లు కావాలా? అని ప్రశ్నించారు.;
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నరకాసుర సంహారం సందేశాన్ని ఇచ్చారు. విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన.. రెండు కీలక పండుగలను గుర్తు చేశారు. వీటిలో దసరా, దీపావళి ఉన్నాయి. ఈ రెండు పండుగలు.. ఈ నెలలో వచ్చాయని.. ఒకటి అంగరంగ వైభవంగా జరుపుకొన్నామని తెలిపారు. ఈ సందర్భంగా దసరా గురించి మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని చెప్పారు. 2024లో అదే జరిగిందన్నారు.
ప్రజలను, రాష్ట్రాన్ని కూడా అన్ని విధాలా వేధించిన చెడు నాయకులను దుర్గమ్మ ఎలా అయితే.. మహిషా రుసుడిని చంపి.. ప్రజల జీవితాలకు విజయం సాధించి పెట్టిందో.. అలానే గత ఎన్నికల్లో దుష్ట పాలకుల ను ప్రజలు తిప్పికొట్టి.. మంచి పాలనకు ఓటేశారని సీఎం చెప్పారు. ఇక, రాబోయే దీపావళి.. నరకాసుర వధకు సంబంధం ఉందన్న ఆయన.. ఆనాడు ప్రజలను పీల్చి పిప్పి చేసిన నరకాసురుడిని శ్రీకృష్ణుడి సతీమణి సత్యభామ వధించిందన్నారు. అలానే.. రాష్ట్రంలోని మహిళలు ఆనాటి నరకాసురుడిని(జగన్) చిత్తుగా ఓడించి.. బుట్టదాఖలు చేశారని చెప్పారు.
ఈ రెండు పండుగలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలని.. ప్రస్తుతం రహదారులు బాగున్నాయని.. ఒకప్పుడు గుంతలు పడిన రోడ్లపై ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పిన చంద్రబాబు మళ్లీ గుంతల రోడ్లు కావాలా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. తాము వేసే రహదారులపై గుంతలు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తు న్నారని.. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. గుజరాత్‌లో ఒకే ప్రభు త్వం అధికారంలో ఉండడం వల్ల.. అక్కడ మేలు జరుగుతోందని తెలిపారు.
అలానే ఏపీలోనూ.. ఒక కూటమి ప్రభుత్వం 30 ఏళ్లు ఉంటే.. అందరి జీవితాలు మారుతాయని చెప్పారు. నరకాసురులను వధించే బాధ్యత మీరు(ప్రజలు) తీసుకోవాలని సూచిస్తున్నట్టు చెప్పారు. మీ(ప్రజలు) బాధ్యతను మేం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇప్పటికే అనేక పథకాలు చేరువ చేశామన్న చంద్రబాబు, రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను చేరువ చేయనున్నట్టు వివరించారు. కానీ, ప్రజలు మాత్రం మహిషాసురులను, నరకాసురులను గుర్తు పెట్టుకుని వారు ఎప్పుడు లేస్తే అప్పుడు వధించేందుకు రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు.