ఒంటికి యోగా మంచిదేగా అంటూ సినీ తారలు !
ఇదంతా ఎందుకు అంటే మరోసారి సినీ తారలు అంతా యోగా చేస్తారని అంటున్నారు.;
అదేదో సినిమాలో ఒక హీరోయిన్ యోగాని కూడా చాలా రొమాంటిక్ గా చేస్తుంది. బంచిక్ బం బం ఒంటికి యోగా మంచిదేగా అని పాడుతూ యోగా అంటే అంతా ఆకర్షణీయమైనదా అనిపిస్తుంది. బహుశా చాలా మంది ఆనాటి యువతరం యోగా గురించి ఆ విధంగా తెలుసుకుని ఉండొచ్చు.
ఇదంతా ఎందుకు అంటే మరోసారి సినీ తారలు అంతా యోగా చేస్తారని అంటున్నారు. యోగా ప్రాముఖ్యతను ప్రాధాన్యతను వారు జనం మధ్యనే ఉంటూ వివరించే ప్రయత్నం చేస్తారుట. ప్రపంచ యోగా దినం ఈ నెల 21న జరుపుకుంటున్నారు. అయితే ఏపీలో ఈసారి యోగా ఉత్సవాలు జరుపుకుంటాను అని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇవ్వడమే ఏపీకి వరం అయింది. అది యోగాకు ఎంతో మేలు చేసింది.
ఏకంగా నెల రోజుల పాటు యోగాంధ్రా పేరుతో ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతీ రోజూ రాష్ట్రమంతా వివిధ వర్గాల చేత యోగాసనాలు వేయిస్తోంది. ఈ విధంగా యోగా గురించి జనాలకు ఇప్పటికే మంచి అవగాహన వచ్చింది.
అయితే యోగాంధ్రా ఉద్యమాన్ని క్లైమాక్స్ కి తీసుకుని వెళ్ళేందుకు కూటమి సర్కార్ మరో కొత్త ఆలోచనను చేస్తోంది. అందరికీ తెలిసిన సినీ తారలు అంతా ఒక్క చోట చేరి యోగాసనాలు వేస్తే ఎలా ఉంటుంది అన్నదే ఆ ఆలోచన.
తారలంతా ఒక్క చోటకు చేరి యోగాసనాలు వేయడం అంతా కలిసి సందడి చేయడం అంటే అది నిజంగా ఇంద్ర ధనస్సు వేడుకే అని అంటున్నారు. ఆ ముచ్చటను నిజం చేయబోతోంది ఏపీ ప్రభుత్వం ఈ నెల 15న తిరుపతి వేదికగా సినీతారలతో యోగా కార్యక్రమం చేపడుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే చాలా మంది తారలను సంప్రదించారని వారంతా సరేనని అన్నారని అంటున్నారు. యోగాసనాలు ఇప్పటిదాకా ప్రముఖులు అంతా వేశారు అధికారులు యోగాంధ్రాలో పాలుపంచుకున్నారు.
అయితే వెండి తెర వేలుపులతోనే ఆ కార్యక్రమం చేయించడం అంటే అది మంచి ఆలోచనగానే చూస్తున్నారు మరి తిరుపతిలో ఈ నెల 15న నిజంగా ఉత్సాహపూరితమైన వాతావరణమే ఉంటుందని చెప్పాలి. యోగా వంటి అద్భుతమైన ఆరోగ్య శిక్షణ గురించి ప్రచారం చేయడం ద్వారా ఏపీ సర్కార్ చాలా మేలు చేస్తోంది అని అంటున్నారు. ప్రధాని మోడీ ఏపీకి వస్తాను అని చెప్పడం ఆ వెంటనే చంద్రబాబు దానిని పట్టుదలగా తీసుకుని యోగా గురించి మారు మూల గ్రామలకు సైతం తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యోగా ఈనాటి యువతరానికి ఆరోగ్య సంపదనే అందిస్తున్నారు అని అంటున్నారు
ఇక సినీ తారలతో యోగా చేపట్టడం ద్వారా ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని పీక్స్ కి తీసుకుని వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏపీలో వరుసగా జరుగుతున్న యోగా కార్యక్రమాలను చూసి ప్రధాని మోడీ ఇప్పటికే ప్రశంసించారు. ఇక ఈ నెల 21న ఆయన విశాఖ వేదికగా జరిగే లక్షలాది మందితో యోగా కార్యక్రమం తరువాత ఇంకెంతగా మెచ్చుకుంటారో చూడాల్సి ఉంది.