వైఎస్సార్‌.. పేరు తీసేయాల‌నే.. : కూట‌మి స‌ర్కారుపై ష‌ర్మిల వ్యాఖ్య‌లు

ఆరోగ్యశ్రీని చంపి యూనివర్సల్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రభుత్వం చేసేది మోసమ‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.;

Update: 2025-09-16 14:02 GMT

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవ‌లు.. సోమ‌వారం అర్ధ‌రాత్రి నుంచి ఆగిపోయాయి. త‌మ‌కు 2500 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు బ‌కాయి ఉంద‌ని పేర్కొంటూ.. కార్పొరేట్ వైద్య శాల‌లు.. ఆరోగ్య శ్రీ ప‌థ‌కం కింద చేసే చికిత్స‌ల‌ను నిలుపుద‌ల చేశాయి. దీనిపై తాజ‌గా రియాక్ట్ అయిన‌.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. త‌నతండ్రి, దివంగ‌త సీఎం రాజ‌శేఖ‌ర‌రెడ్డికి పేరు వ‌స్తుంద‌న్న కార‌ణంగానే కూట‌మి ప్ర‌భుత్వం .. ఆరోగ్య శ్రీని నాశ‌నం చేసింద‌ని మండిప‌డ్డారు. ``దివంగత నేత వైఎస్ మానస పుత్రిక ఆరోగ్య శ్రీ పథకం.`` అని వ్యాఖ్యానించారు.

ఈ ప‌ధ‌కం పేద కుటుంబాలకు మరో పునర్జన్మ ఇచ్చింద‌ని ష‌ర్మిల చెప్పారు. ఎంత పెద్ద జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఉంటుంద‌ని, ఇంతటి మహత్తరమైన పథకాన్ని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని దుయ్య‌బ‌ట్టారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిందని వ్యాఖ్యానించారు. ఏడాదిన్నరగా రూ.2500 వేల కోట్లు బకాయిలు పెట్టార‌ని, దీనిని బ‌ట్టి ఆరోగ్యశ్రీ అమలుపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏంటో తేటతెల్లమయ్యిందని అన్నారు. బకాయిల భారం పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేన‌ని చెప్పుకొచ్చారు.

ఆరోగ్యశ్రీని చంపి యూనివర్సల్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రభుత్వం చేసేది మోసమ‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ఈ ప థకాన్ని ప్రైవేట్ బీమాతో ముడిపెట్టడం అంటే ప్రజారోగ్యానికి ఎసరు పెట్టడమేన‌ని అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అన్నారని, ఇప్పుడు 10 శాతానికి కుదించి రూ.2.5 లక్షల ప్రైవేట్ బీమాతో సరిపెడుతున్నారని ష‌ర్మిల వివ‌రించారు. పేద ప్రజల ప్రాణాలు కాపాడే ఆరోగ్యశ్రీపై ఇన్ని కుట్రలు ఎందుకని నిల‌దీశారు. ఎవరిపై ఈ కక్ష‌? ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ? ఎవరి లాభం కోసం ఇదంతా చేస్తున్నా రు? అని ఆమె నిల‌దీశారు.

ఏడాదికి ఆరోగ్యశ్రీ కింద రూ.4వేల కోట్ల కేటాయింపున‌కు మనసు రాని ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడానికి వేల కోట్లు ఎక్కడ నుంచి వస్తాయని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఆరోగ్యశ్రీ కింద 1.60 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే దాని కన్నా.. బీమా కంపెనీలు ఇచ్చేది ఎక్కువ కాదా? అని ప్ర‌శ్నించారు. రూ.2.5 లక్షల లోపు ఆరోగ్య బీమా ఏంటి.. ఆపై ఖర్చును ట్రస్ట్ చెల్లించడం ఏంటి ? అని నిల‌దీశారు. దేశంలో ప్రైవేట్ బీమా అమలు చేసిన 18 రాష్ట్రాల్లో తిరిగి 16 రాష్ట్రాలు ప్రభుత్వ ట్రస్ట్ విధానానికి మార్చుకున్నాయని వివ‌రించారు.

Tags:    

Similar News