కూటమి సక్సెస్ : రికార్డు స్థాయిలో పేదింటి గృహ ప్రవేశాలు
ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కో హామీనీ నెరవేర్చుకుంటూ వస్తోంది.;
ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కో హామీనీ నెరవేర్చుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తామని అన్న మరో కీలక హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ఏడాది జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతుంది.
ఈ సందర్భంగా కీలకమైన హామీని అమలు చేసేందుకు తీవ్ర కసరత్తుని చేస్తోంది. ఒకేసారి మూడు లక్షల మంది పేదలకు సొంతిళ్ళు నిర్మించి ఇవ్వడమే కాకుండా వారి చేత అదే రోజున గృహ ప్రవేశం చేయించాలని కూటమి సర్కార్ భావిస్తోంది. ఈ విధంగా లక్షల మంది పేదలకు ఒకేసారి సొంతింటి కోరికను తీర్చడమే కాకుండా భారీ ఎత్తున గృహ ప్రవేశం చేయించడం అంటే అతి పెద్ద రికార్డుగా చూస్తున్నారు.
ఏపీలో చూస్తే కనుక సరిగ్గా మరో యాభై రోజుల సమయం మాత్రమే ఉంది. దాంతో అధికారులను ఈ విషయం మీద పరుగులు పెట్టిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్షల ఇళ్ళు జూన్ 12 నాటికి పూర్తి అయి గృహ ప్రవేశానికి సిద్ధం కావాల్సిందే అని ప్రభుత్వం పట్టుదల మీద ఉంది.
మరో వైపు చూస్తే కనుక ఇప్పటివరకూ ఒక లక్షా డెబ్బై వేలకు పైగా పేదల ఇళ్ళు పూర్తి అయినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక మిగిలిన ఇళ్ళను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో నిధుల కొరత లేకుండా కూటమి ప్రభుత్వం చూస్తోంది. అవసరమైన పక్షంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులను తీసుకుని వచ్చి అయినా సకాలంలో ఈ ఇళ్ళను పూర్తి చేయిచాలని చూస్తున్నారు.
ఈ మేరకు వరస సమీక్షలతో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. కేవలం అధికారులు మాత్రమే కాకుండా ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజా ప్రతినిధులు కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతోంది. అంతా కలిసి జూన్ 12 నాటికి పేదింటి కలను తీర్చాలన్నది కూటమి ప్రభుత్వం సంకల్పంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు.
ఇదిలా ఉంటే దేశంలో ఇంత పెద్ద ఎత్తున మూడు లక్షల ఇళ్ళు ఒకేసారి గృహ ప్రవేశం చేయించిన సందర్భాలు అయితే లేవు. ఒక విధంగా ఇది జాతీయ రికార్డుగా ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో పాటు దేశమంతా జూన్ 12న ఏపీ వైపు ఆసక్తిగా చూసేలా ఈ భారీ కార్యక్రమం ఉంటుందని అంటున్నారు.
ఇక జూన్ 12న మూడు లక్షల మంది పేదల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని కూడా గొప్పగా నిర్వహించేందుకు ప్రభుత్వం చూస్తోంది ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు అంతా ప్రతీ పేద ఇంటికీ వెళ్ళి వారిని కొత్త ఇంటికి గౌరవంగా తీసుకుని వెళ్ళి గృహ ప్రవేశం చేయిస్తారు అని అంటున్నారు.
ఇది కూటమి ప్రభుత్వం చరిత్రలో సువర్ణ అక్షరాలలో నిలిచిపోవాలని ఏపీలో జూన్ 12 పేదలకు నిజమైన పండుగ కావాలని కూటమి సర్కార్ తపిస్తోంది. మొత్తం మీద చూస్తే ఒకేసారి మూడు లక్షల మంది పేదలకు సొంతింటిని అందిస్తే కనుక వారు కూటమి పక్షంగా ఎప్పటికీ ఉండడం ఖాయం. సంక్షేమం అంటే ఇదీ అని వైసీపీకి చూపించి మరీ ఆ పార్టీకి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీయడానికి కూడా ఈ తరహా కార్యక్రమాలు దోహదపడతాయని అంటున్నారు.