నెలలో 15రోజుల‌కు ఒక‌సారి జీత‌మివ్వాలి: షాదీ డాట్‌కాం మిట్ట‌ల్ ప్ర‌తిపాద‌న‌!

జీతాలు అందే సమయం అనేది ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని యాజమాన్యాలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మిట్ట‌ల్ అభిప్రాయపడ్డారు.

Update: 2026-06-04 07:21 GMT

భారతీయ కార్పొరేట్ - పారిశ్రామిక రంగాలు దశాబ్దాలుగా అనుసరిస్తున్న సాంప్రదాయ నెలవారీ జీతాల పంపిణీ విధానంపై `షార్క్ ట్యాంక్ ఇండియా` జడ్జి, `షాదీ డాట్ కామ్` వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. చాలా సంస్థలలో నెల పొడవునా పనిచేసిన తర్వాత తదుపరి నెల మొదటి వారంలో జీతం ఇచ్చే పద్ధతి సాధారణంగా వస్తోంది. అయితే దీనికి భిన్నంగా ఉద్యోగులకు ప్రతి నెలలో రెండు సార్లు జీతాలు చెల్లించే సరికొత్త విధానాన్ని తీసుకురావాలని ఆయన తన లింక్డ్‌ఇన్ పోస్ట్ ద్వారా ప్రతిపాదించారు. జీతాలు అందే సమయం అనేది ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని యాజమాన్యాలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మిట్ట‌ల్ అభిప్రాయపడ్డారు.

సాధారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులను ఆకర్షించడానికి అదనపు సెలవులు, ఉచిత టీ - కాఫీ- ఆహారం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి ఆకర్షణీయమైన ప్రయోజనాల గురించి ప్రచారాలు చేస్తాయి కానీ.. అసలు జీతం ఎప్పుడు చేతికి అందుతుందనే ముఖ్యమైన విషయంపై చర్చించవని మిట్టల్ గుర్తుచేశారు. మ‌న దేశంలో ఇంచుమించు అన్ని కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు ఒక‌టో తేదీ నుంచి 7వ తేదీలోపు జీతాలిస్తున్నాయి. కొన్నిసార్లు వీకెండ్ సెల‌వులు.. పబ్లిక్ హాలిడేస్ వస్తే ఈ జీతాల క్రెడిట్ మరింత ఆలస్యమవుతుంది. ప్రతినెలా కచ్చితమైన తేదీలలో ఇండ్ల అద్దెలు, ఈఎంఐలు, నిత్యావసర ఖర్చులను బ్యాలెన్స్ చేసుకునే సగటు ఉద్యోగులకు ఈ చిన్నపాటి ఆలస్యం కూడా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

యాజమాన్యాల కోణంలో జీతాల పంపిణీ అనేది ఒక సాధారణ అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియగా అనిపించవచ్చు కానీ... ఉద్యోగుల జీవితాలపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అనుపమ్ మిట్టల్ స్పష్టం చేశారు. జీతం ఆలస్యం కావడం వల్ల లోన్ పేమెంట్లు మిస్ అవ్వడం, ఆర్థిక జరిమానాలు పడటం, మానసిక ఆందోళన చెందడం వంటి సమస్యలు వస్తాయి. ఉద్యోగుల అవ‌స‌రాల్ని టైమింగ్ ని గ‌మ‌నించి కొన్నేళ్ల క్రిత‌మే త‌న షాడీ డాట్ కాంలో ఉద్యోగుల‌కు జీతాలిచ్చే విధానం మారింద‌ని తెలిపారు. జీతాలను రాబోవు నెలలో కాకుండా.. ప్రస్తుత నెల చివరి రోజే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తున్నామని... దీనిని ఒక అదనపు ప్రయోజనంగా కాకుండా కనీస అవసరంగా భావించి అమలు చేస్తున్నామని మిట్ట‌ల్ ఉదహరించారు.

ఈ సందర్భంగా బిజినెస్ మేన్ మిట్ట‌ల్ ఉపయోగించిన `క్యాష్ ఫ్లో ఈజ్ డిగ్నిటీ` (నగదు ప్రవాహమే ఆత్మగౌరవం) అనే పదం ప్రస్తుతం నెట్టింట విపరీతంగా మార్మోగుతోంది. ఒక యజమానికి వారం రోజులు ఆలస్యం అనేది కేవలం ఒక అకౌంటింగ్ వివరమే కావచ్చు కానీ... మెజారిటీ భారతీయులకు అది ఈఎంఐ బౌన్స్ అవ్వడమో... అద్దె కోసం ఇబ్బంది పడడమో లేదా అవసరం లేని సమస్యను పరిష్కరించడానికి సగం రోజు సమయాన్ని వృధా చేసుకోవడమో అవుతుందని మిట్టల్ పేర్కొన్నారు. అందుకే కంపెనీలు బ్రిటీష్ కాలం నాటి పాత శాలరీ విధానానికి స్వస్తి పలికి.. ప్రతినెలా 15న‌ , అలాగే 30వ తేదీన‌ (సెమీ-మంత్లీ) రెండు సార్లు జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. టెక్నాలజీ అందుబాటులో ఉన్న 2026లో పేరోల్ టీమ్‌లకు ఇది పెద్ద బ్రహ్మవిద్య ఏమీ కాదని... దీనివల్ల అప్పుల ఊబి నుంచి ఉపశమనం లభించి.. మార్కెట్‌లో ఖర్చు చేసే వేగం పెరిగి దేశ జీడీపీ కి కూడా ఊతం లభిస్తుందని ఆయన విశ్లేషించారు.

వ్యాపారం - వ‌ర్క్ క‌ల్చ‌ర్‌పై ఇలాంటి విప్లవాత్మక ఆలోచనలను షేర్ చేసే అనుపమ్ మిట్టల్ `షార్క్‌ ట్యాంక్ ఇండియా` షో ద్వారా దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్వెస్టర్‌గా ఎదిగారు. 2021లో ఈ షో ప్రారంభమైనప్పటి నుండి ఆయన అత్యంత చురుకైన పెట్టుబడిదారుడిగా కొనసాగుతున్నారు. మొదటి నాలుగు సీజన్లలోనే అత‌డు సుమారు 103 డీల్స్ క్లోజ్ చేసి.. ప‌లు వ్యాపారాలలో రూ.37.3 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 5లో కూడా హోమ్‌స్ట్రాప్, డికోడ్ ఏజ్, ది హానెస్ట్ హోమ్ కంపెనీ వంటి స్టార్టప్‌లలో అత‌డు పెట్టిన పెట్టుబడులు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి.

Tags:    

Similar News